- ఇండిపెండెంట్లకు 75 గుర్తులు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే అధికారులు చకా చకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే విడత ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే మున్సిపల్, పోలీస్ శాఖల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకుంది.
ఎన్నికలు జరగబోయే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఫైనల్ ఓటర్లిస్టులను ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్రంలోని131 బల్దియాలు, 3,544 వార్డుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. శనివారం ఆయా మున్సిపల్ చైర్పర్సన్, మేయర్సహా వార్డుస్థానాలు ఏయే వర్గాలకు రిజర్వ్అయ్యాయనే వివరాలను ప్రకటించనున్నారు. ఇందుకోసమే ఆశావహులు ఎదురుచూస్తున్నారు.
సింబల్స్ విడుదల..
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించనున్న సింబల్స్(గుర్తుల)ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 75 గుర్తులను కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం గెజిట్ జారీ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాలెట్పేపర్లో మొదటిస్థానం దక్కనుంది. బీఎస్పీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు వరసగా స్థానాలు కేటాయించారు. ఆ తర్వాత రాష్ట్రంలో రిజిస్టర్అయిన ఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత ఇతర రాష్ట్రాలలో రిజిష్టర్ అయిన 4 పార్టీలకు స్థానం కల్పించారు.
ఇందులో సీపీఐ, జనసేన పార్టీలు ఉన్నాయి. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘంలో రిజిష్టర్ అయ్యి, పార్టీ సింబల్స్ లేని 77 పొలిటికల్ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 75 గుర్తులను కేటాయించారు. ఇందులో మొదటగా ఏసీ, యాపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బ్రెడ్ వంటి గుర్తులున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ 8,195 పోలింగ్ స్టేషన్లను గుర్తించింది.
