ఇక జోరుగా ఆలుగడ్డ సాగు!.. రాష్ట్రంలో ప్రస్తుతం 6,600 ఎకరాల్లోనే పంట.. మరో 50వేల ఎకరాలు సాగుకు అనుకూలం

ఇక జోరుగా ఆలుగడ్డ సాగు!.. రాష్ట్రంలో ప్రస్తుతం 6,600 ఎకరాల్లోనే పంట.. మరో 50వేల ఎకరాలు సాగుకు అనుకూలం
  • మనకు ఏటా కావాల్సిన ఆలుగడ్డలు 2.04 లక్షల టన్నులు
  • ఉత్పత్తి మాత్రం 30 వేల టన్నులే
  • మన అవసరాలు తీరాలంటే మరో 17 వేల ఎకరాల్లో సాగు అవసరం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆలుగడ్డల సాగును విస్తరించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు. ఈ పంట సాగు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఎకరాలు అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. రాష్ట్రంలో ఆలుగడ్డ రోజువారీ తలసరి వినియోగం 50 గ్రాములకు పైగా ఉండగా, ఏటా 2.04 లక్షల టన్నులు అవసరమవుతున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6,606 ఎకరాల్లో మాత్రమే ఆలుగడ్డ సాగవుతున్నది. 

ఫలితంగా ఉత్పత్తి ఏటా 38 వేల టన్నులకు మించట్లేదు. దీంతో 79 శాతం ఆలుగడ్డలను ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఇందుకోసం ఏటా రూ.403 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు హార్టికల్చర్ ఎక్స్​పర్ట్స్​చెబుతున్నారు. 2024లో రాష్ట్ర వ్యాప్తంగా 25,864 టన్నుల ఆలు దిగుబడి వచ్చిందని అధికారులు తెలిపారు. అంటే 1.41 లక్షల టన్నుల కొరత ఏర్పడిందని, దీన్ని అధిగమించాలంటే రాష్ట్రంలో మరో 17,676 ఎకరాల్లో ఆలు సాగు పెంచాలని సూచిస్తున్నారు. ఈ పంటకు ఏడాది పొడవునా మార్కెట్ డిమాండ్ ఉండటం, కేవలం 90 రోజుల్లోనే చేతికి వచ్చేది కావడంతో రైతులు కూడా సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు. 

7 రకాల విత్తనాలకు అనుకూలం.. 

హార్టికల్చర్​అధ్యయనాల ప్రకారం రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగుకు అనుకూల వాతావరణం ఉంది. వికారాబాద్‌‌, సంగారెడ్డి, సిద్దిపేట‌‌, మెదక్‌‌ జిల్లాల్లో చల్లని వాతావరణం, ఫెర్టైల్‌‌ సాయిల్‌‌ ఉండటంతో ఆలుగడ్డ సాగుకు విస్తార అవకాశాలు ఉన్నాయని హార్టికల్చర్ అధ్యయనాలు తేల్చాయి. ఇక్కడ లేట్ బ్లైట్, బ్యాక్టీరియల్ తెగులు వంటి వ్యాధులు తక్కువగా ఉంటాయి. కుఫ్రీ సూర్య, కుఫ్రీ ఖ్యాతి, చంద్రముఖి, బాద్షా, పుఖ్రాజ్, జ్యోతి, చిప్సోన-3.. ఇలా ఏడు రకాల విత్తనాలు రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నాయని జాతీయ ఆలుగడ్డ పరిశోధన కేంద్రం (సిమ్లా) గుర్తించింది. ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయని, ఎకరానికి 200 నుంచి 400 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపింది. 

అపికల్ రూటెడ్ కట్టింగ్ సీడ్ టెక్నాలజీని అమలు చేసి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు పరిశోధన సంస్థలు సహకరిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌లో 'కుఫ్రీ పుఖ్రాజ్, కుఫ్రీ హిమాలిని' రకాలతో విజయవంతమైన ప్రయోగాలు జరిగాయి. అక్టోబర్ లో విత్తనం వేస్తే మూడు నెలల్లో పంట చేతికి వస్తుందని హార్టికల్చర్​నిపుణులు చెబుతున్నారు.  

రైతులకు ఆదాయం.. 

కూలీల కొరత, చీడ పీడలు, అకాల వర్షాలు వంటి సమస్యలతో బాధపడుతున్న రైతులు.. ఆలుగడ్డ సాగు వైపు మళ్లితే లాభసాటిగా ఉంటుందని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు. ఆలుగడ్డల సాగు పెరిగితే దిగుమతి వ్యయం తగ్గి, రైతుల ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. 

సాగు పెరిగితే స్వయం సమృద్ధి.. 

ప్రస్తుతం మనం ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఆలుగడ్డలు దిగుమతి చేసుకుంటున్నం. దీనివల్ల రవాణా ఖర్చులు, నిల్వ సవాళ్లు, ధరల మార్పులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. స్థానికంగా ఆలుగడ్డల ఉత్పత్తి పెరిగితే దిగుమతి వ్యయం తగ్గి, రైతుల ఆదాయం పెరిగి, రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించే అవకాశం ఉంది. ఇక్కడి వాతావరణం ఆలుగడ్డల సాగుకు అనుకూలంగా ఉండడంతో ఉత్తరాది కంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆలుగడ్డల్లో అధిక వేడిని తట్టుకునే రకాలు అందుబాటులో ఉన్నాయి.   - దండా రాజిరెడ్డి, వీసీ, హార్టికల్చర్​యూనివర్సిటీ