చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ ను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులు, ఉత్పత్తితో చైనాను లీడ్ చేస్తుందన్నారు. అదే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం (డిసెంబర్ 08) భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగించిన సీఎం.. తెలంగాణ పోటీ చైనా, జపాన్ ల దేశాలతోనని అన్నారు. 2047 నాటికి సరికొత్త లక్ష్యాలతో ముందుకెళ్లనున్నట్లు చెప్పారు సీఎం రేవంత్.
రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు ‘తెలంగాణ రైజింగ్- 2047’ పేరుతో విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేస్తామన్నారు. ఓఆర్‌ఆర్ లోపలి ప్రాంతాన్ని ‘క్యూర్ (కోర్ అర్బన్)’గా, ఓఆర్‌ఆర్–-ట్రిపుల్ఆర్ మధ్య ప్రాంతాన్ని ‘ప్యూర్ (పెరీ అర్బన్)’గా, ట్రిపుల్ఆర్ అవతలి నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ప్రాంతాన్ని ‘రేర్ (రూరల్ అగ్రికల్చరల్)’గా వర్గీకరిస్తున్నామని వివరించారు. మహిళలు, రైతులు, యువత, వివిధ సామాజిక వర్గాల ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ విజన్ డాక్యుమెంట్ రెడీ చేశామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను గవర్నర్ ప్రారంభించారు. 2025 డిసెంబర్ 08 నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చాలన్న విజన్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అత్యంత ఆధునిక హంగులతో కూడిన వేదికలు, డిజిటల్ టన్నెళ్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి.. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించడమే ప్రధాన అజెండాగా ఈ సమిట్ నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
