- ఈ నెల 11 నుంచి ఫీజుల చెల్లింపు షురూ
- షెడ్యూల్ రిలీజ్ చేసిన డైరెక్టర్ శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజుల షెడ్యూల్ ను శనివారం ఆయన రిలీజ్ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-–26) లో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్లతో పాటు.. గతంలో అడ్మిషన్ తీసుకొని ఫెయిల్ అయినోళ్లు, అడ్మిషన్ ఉన్నా ఇప్పటి వరకూ పరీక్ష రాయని వాళ్లంతా ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చని ఆయన తెలిపారు.
ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 11 నుంచి 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. రూ.25 ఫైన్‌తో (ఒక్కో పేపర్‌కు) ఈ నెల 27 నుంచి జనవరి 2 వరకు, రూ.50 ఫైన్‌తో (ఒక్కో పేపర్‌కు) జనవరి 3 నుంచి 7 వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చలాన్లు గానీ, డీడీల రూపంలో గానీ ఫీజులు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఫీజులను వెబ్‌సైట్ www.telanganaopen school.org ద్వారా గానీ లేదా టీజీ ఆన్‌లైన్/మీ సేవ సెంటర్ల ద్వారా గానీ కట్టవచ్చని సూచించారు.
