యాసంగి ధాన్యం కొనుగోళ్లు 56.24 శాతం పూర్తి

యాసంగి ధాన్యం కొనుగోళ్లు 56.24 శాతం పూర్తి
  • ఈ సీజన్​ కొనుగోళ్ల టార్గెట్ 70 లక్షల టన్నులు
  • ఇప్పటికే 39.37లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు
  • బోనస్​తో సెంటర్లకు పోటెత్తుతున్న సన్నవడ్లు

హైదరాబాద్​, వెలుగు: యాసంగి వరికోతలు దాదాపు పూర్తవడంతో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8,245 సెంటర్లలో కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే నిర్దేశించుకున్న టార్గెట్​లో 56 శాతానికిపై ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. యాసంగిలో లేటుగా వరి సాగు  చేసిన ప్రాంతాల్లోనే  కోతలు చివరి దశలో ఉన్నాయి. మిగతా అంతటా పూర్తి కాగా.. సెంటర్ల ద్వారా వడ్ల కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయి. సివిల్​ సప్లయ్స్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ డీఎస్​ చౌహాన్​ ఆధ్వర్యంలో అధికారులు  ముందస్తు చర్యలు చేపట్టారు. 

కొనుగోళ్లు వేగంగా పూర్తయ్యేలా జిల్లా జాయింట్​ కలెక్టర్లు, సివిల్ సప్లయ్స్​అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సర్కారు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్​ అమలు చేస్తున్న నేపథ్యంలో సెంటర్లకు సన్నవడ్లు పోటెత్తుతున్నాయి. 

నిరుడితో పోలిస్తే పెరిగిన కొనుగోళ్లు

ఈ ఏడాది యాసంగి వడ్ల కొనుగోళ్లు 25 రోజుల ముందగానే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా  సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ కొనుగోలు సెంటర్లను ప్రారంభించింది. గడిచిన 50 రోజుల్లో 5.77లక్షల మంది రైతుల నుంచి 39.37లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లు జరిగాయి. నిరుడు ఇదే టైమ్​కు 28.34 లక్షల టన్నుల వడ్లు కొన్నారు. అంటే ఈ యేడు నిరుడి కంటే 11 లక్షల టన్నులు అదనంగా కొనుగోళ్లు జరిగాయి. ప్రతిరోజూ లక్షన్నర టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నట్లు సివిల్​ సప్లయ్స్​ వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్​ జిల్లాలో అత్యధికంగా 7.47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. నల్గొండ జిల్లా 4.55 లక్షల టన్నుల వడ్ల కొనుగోళ్లతో రెండో స్థానంలో నిలిచింది. 

ఆ తర్వాత  కామారెడ్డి జిల్లాలో 2.90 లక్షల టన్నులు,  జగిత్యాలలో 2.18 లక్షల టన్నులు, సూర్యాపేట జిల్లాలో 2 లక్షల టన్నులు, కరీంనగర్​ జిల్లాలో 1.94 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. రంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, హన్మకొండ, ఆదిలాబాద్​ జిల్లాల్లో కొనుగోళ్లు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. అకాల వర్షాలతోనూ పలుచోట్ల కొనుగోళ్లకు అడ్డంకులు ఎదురయ్యాయి.  ఇప్పుడు వర్షాలు తగ్గిపోవడంతో కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నాయి.  .

టార్గెట్​లో 56.24 శాతం కొనుగోళ్లు

ఈ యాసంగిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 59.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సన్న ధాన్యానికి సర్కారు బోనస్​ ప్రకటించడంతో  సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాసంగి వరి ధాన్యం 1.30 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసింది. సాగైన వరిలో 60 శాతానికి పైగా  సన్న రకాలే సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.  ఈ నేపథ్యంలో దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం.. కొనుగోలు సెంటర్లకు వచ్చే అవకాశం ఉందని సివిల్​ సప్లయ్స్​ శాఖ అంచనా వేస్తున్నది. 

సివిల్​ సప్లయ్స్​ డిపార్ట్​మెంట్​ పెట్టుకున్న టార్గెట్​లో ఇప్పటికే 56.24 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో సన్నబియ్యాన్ని సర్కారు రేషన్​ లబ్ధిదారులకు అందిస్తున్నది. ఈ నేపథ్యంలో మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్​ చెల్లించి, రైతులనుంచి ప్రభుత్వం ధాన్యాన్ని సేకరిస్తున్నది. దీంతో మార్కెట్​కు వస్తున్న ధాన్యంలో ఎక్కువశాతం సన్న వడ్లు ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా జిల్లాల్లో గతంలో వ్యాపారులకు అమ్ముకునే సన్న ధాన్యం.. ఇప్పుడు సెంటర్లకే ఎక్కువగా వస్తున్నది. అదనంగా ధర వస్తుండడంతో సెంటర్లకు సన్న వడ్లు పోటెత్తుతున్నాయి.