
- భూభారతి ద్వారా సాదాబైనామ సమస్యలు పరిష్కరిస్తం
- అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు
- మంత్రి పొంగులేటి వెల్లడి
వైరా, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 15లోపు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక, గరికపాడు, దాసాపురం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సాదా బైనమా, ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 15లోపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నెల గడువు విధించి భూ భారతి ద్వారా సాదా బైనమా సమస్యలు పరిష్కరిస్తాం. అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం”అని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజముల్ ఖాన్‌కు మంత్రి ఫోన్‌లో ఆదేశించారు. గన్నవరం, గొల్లపూడి గ్రామాలలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దానిని అర్హులైన పేదలకు అందించాలని సూచించారు. అనంతరం పంచాయతీ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.