- విత్ డ్రాలు పూర్తి
- 9న మూడో విడత ఫైనల్ లిస్ట్
- జోరందుకున్న ప్రచారాలు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగియడంతో రెండో విడతలో సర్పంచ్ స్థానాలకు, వార్డ్ మెంబర్ స్థానాలకు మిగిలిన అభ్యర్థుల లెక్క తేలింది. పలు సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
సిద్దిపేట జిల్లాలో..
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిన్నకోడూరు, అక్బర్ పేట భూంపల్లి, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట, హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని బెజ్జంకి మండలాల పరిధిలోని 182 పంచాయతీలు, 1,644 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్ స్థానాలకు 694 మంది, వార్డు స్థానాలకు 3,917 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 10 సర్పంచ్ స్థానాలు, 278 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
నంగునూరు మండలం ఖాతా సర్పంచ్ గా పులూరు సోని మహేశ్, సంతోష్ నగర్ సర్పంచ్ గా బానోతు సరోజని కిషన్, చిన్నకోడూరు మండలం రామంచ సర్పంచ్ గా ఎర్ర భవానీ నవీన్ కుమార్, మిరుదొడ్డి మండలం తాళ్లపల్లి సర్పంచ్ గా నీల ప్రభాకర్, అక్బర్ పేట భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ గా పి.లావణ్య, అల్మాజీ పూర్ సర్పంచ్ గా ఎన్.పద్మ మల్లేశం, బెజ్జంకి మండలం నర్సింలు పల్లి సర్పంచ్ గా జె.రమేశ్, దుబ్బాక మండలం పోతారం సర్పంచ్ గా సల్కం రేణుక మల్లేశ్‌యాదవ్, వెంకటగిరి తండా సర్పంచ్ గా బానోతు రంజ ఎన్నికయ్యారు.
సిద్దిపేట అర్బన్ మండలం పండవ పురం సర్పంచ్ స్థానానికి ఒక్క నామినేషన్ దాఖలు కాగా ఇక్కడ పదవికి వేలం నిర్వహిస్తుండగా పోలీసులు కేసు నమోదు చేయడంతో ఏకగ్రీవ ఎన్నికపై ప్రకటన పెండింగ్ లో పెట్టారు. పోలీస్ కేసు నేపథ్యంలో ఏకగ్రీవ ఎన్నిక ప్రకటన చేయాలా వద్దా అనే అంశంపై కలెక్టర్ హైమావతి పరిశీలన జరుపుతుండగా కాంగ్రెస్ నాయకులు సైతం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
మెదక్ జిల్లాలో..
రెండో విడతలో మెదక్ జిల్లాలో 8 మండలాల పరిధిలో ఉన్న 149 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 1,290 వార్డ్ మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 7 సర్పంచ్ స్థానాలు, 254 వార్డ్ మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇవిపోను 142 సర్పంచ్, 1,035 వార్డ్ మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వెల్దుర్తి మండలం బస్వాపూర్, నగరం, శౌకత్ పల్లి, నంద గోకుల్, మెదక్ మండలం మల్కా పూర్, చిన్న శంకరంపేట మండలం గవల పల్లి తండా, తుర్కల మందాపూర్ తండా, సంగాయపల్లి సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో మొత్తం 243 గ్రామ పంచాయతీలు, 2,164 వార్డు స్థానాలకు అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేయగా ఇందులో 14 పంచాయతీలు, 222 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 229 సర్పంచ్ స్థానాలకు 649 మంది అభ్యర్థులు, 1,941 వార్డు స్థానాలకు 4,505 మంది క్యాండిడేట్లు బరిలో నిలిచారు. అభ్యర్థులకు పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రధానంగా వారంతా సొంత మేనిఫెస్టోలతో ప్రచారం చేసుకుంటున్నారు.
ఒక్కో పంచాయతీ నుంచి దాదాపు ముగ్గురేసి అభ్యర్థులు పోటీపడుతుండగా ఎన్నికల హామీలు ప్రధాన అంశాలుగా మారాయి. మూడో విడత ఎన్నికల నామినేషన్ ఘట్టం పూర్తికాగా ఈనెల 9న అధికారులు పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.
మెదక్ జిల్లా
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
అల్లాదుర్గం 16 56 152 283
చేగుంట 25 114 226 529
నార్సింగి 9 63 80 394
మనోహరాబాద్ 17 69 148 349
తూప్రాన్ 14 42 114 204
రామాయంపేట 16 52 138 283
నిజాంపేట 16 70 142 302
మెదక్ 21 91 178 580
చిన్నశంకరంపేట 31 40 264 279
మొత్తం 147 541 1,034 2,920
సంగారెడ్డి జిల్లా..
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
అందోల్ 24 68 211 474
చౌటకూర్ 14 44 125 311
పుల్కల్ 15 47 145 372
వట్ పల్లి 21 62 177 384
రాయికోడ్ 31 72 235 516
ఝరాసంగం 31 76 241 563
జహీరాబాద్ 22 64 201 466
మొగుడంపల్లి 18 60 158 410
కోహిర్ 23 70 210 497
మునిపల్లి 30 79 238 512
మొత్తం 229 649 1,941 4,505
సిద్దిపేట జిల్లా..
మండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు
సిద్దిపేట రూరల్ 15 73 140 361
సిద్దిపేట అర్బన్ 12 46 116 321
నారాయణరావుపేట 11 50 96 233
చిన్నకోడూరు 28 99 256 613
నంగునూరు 25 86 220 483
దుబ్బాక 21 72 188 422
మిరుదొడ్డి 10 48 98 283
అక్బర్ పేట 19 76 168 385
తొగుట 17 58 152 365
బెజ్జంకి 24 86 168 451
మొత్తం 182 694 1644 3917
