పరిషత్​ తుది దశ రేపే

పరిషత్​ తుది దశ రేపే

161 జడ్పీటీసీలు, 1740 ఎంపీటీసీలకు ఎన్నికలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ తుది దశ ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. మంగళవారం పోలింగ్​ జరుగనుంది. మొత్తం మూడు దశల్లో జరుగుతున్న పరిషత్​ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయ. చివరిదైన మూడో దశలో 161 జడ్పీటీసీలు, 1740 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 6న జరిగిన మొదటి దశ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా అజీజ్​నగర్ ఎంపీటీసీ, సిద్దిపేట జిల్లా అల్వాల్ ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా.. బ్యాలెట్ పేపర్లు తారుమారవటంతో వాటికి ఈ దశలో ఎన్నిక నిర్వహిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు, ఇతర జిల్లాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది.

తక్కువ ఏకగ్రీవాలు
ఈ నెల 6న జరిగిన మొదటి దశలో 67 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు.. 10న జరిగిన రెండో దశ ఎన్నికల్లో 63 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ ఏకగ్రీవం అయ్యాయి. మూడో దశ ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించలేదు. జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం 40లోపే ఎంపీటీసీలు, ఒక జడ్పీటీసీ ఏకగ్రీవమైనట్టు సమాచారం. పరిషత్​ ఎన్నికలు ఈ నెల 14తో ముగియనుండగా ఈ నెల 27న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్లు లెక్కించి అదేరోజు ఫలితాలను ప్రకటించనుంది.

గగ్గనపల్లి ఎంపీటీసీ ఎన్నిక రద్దు
నాగర్ కర్నూలు జిల్లా గగ్గనపల్లి ఎంపీటీసీ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ స్థానంలో అధికార టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి దొడ్ల ఈశ్వర్ రెడ్డి తన నామినేషన్ వెనక్కి తీసుకునేందుకు రూ. 10 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి దొడ్ల వెంకటనారాయణరెడ్డి కలెక్టర్ కు ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ , ఎస్పీని ఎన్నికల సంఘం ఆదేశించటంతో వారు నివేదిక అందజేశారు. దీంతో అక్కడ ఎన్నికను రద్దు చేస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించేది త్వరలోనే ప్రకటించనుంది. అయితే టీఆర్ ఎస్ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించటంతో 8 వారాల వరకు ఈ ఎన్నికపై ఏ నిర్ణయం తీసుకోవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.