తెలంగాణలో తబ్రీడ్ భారీ పెట్టుబడి

తెలంగాణలో తబ్రీడ్ భారీ పెట్టుబడి

హైదరాబాద్, వెలుగు:  ప్రముఖ కూలింగ్ యుటిలిటీ కంపెనీ తబ్రీడ్ తెలంగాణలో రూ.1,600 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. దుబాయ్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై, ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన కూలింగ్ సొల్యూషన్స్ ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫార్మాసిటీతో పాటు అన్ని ఇండస్ట్రియల్ క్లస్టర్లలో కూలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పారు. 1.25 లక్షల టన్నుల రిఫ్రిజిరేషన్ కూలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌‌ను డెవలప్ చేస్తామని, తద్వారా 24 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే వీలు కలుగుతుందని పేర్కొన్నారు. 

తమ ప్రభుత్వం పర్యావరణ రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, తక్కువ కరెంట్‌ను ఉపయోగించుకుంటూ ఎక్కువ ప్రయోజనం ఉండే కూల్ రూఫ్ పాలసీ తీసుకొచ్చామని కేటీఆర్ తెలిపారు. 2047 నాటికి నెట్ జీరో టార్గెట్ సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ భేటీలో తబ్రీడ్ సీఈవో ఖలీద్ అల్ మర్జు, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఫార్మా సిటీ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణోళ్లకు క్షమాభిక్ష పెట్టండి..

దుబాయ్‌లోని అవీర్ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని ఆ దేశ అధికారులు, ఇండియన్‌ కాన్సుల్ కార్యాలయ అధికారులను మంత్రి కేటీఆర్ కోరారు. దుబాయ్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. ఆ దేశ అధికారులతో పాటు తెలంగాణ వాసుల తరఫున కేసు వాదిస్తున్న అడ్వకేట్‌తో సమావేశమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి, శివరాత్రి మల్లేశ్, గొల్లెం నాంపల్లి, దుండగుల లక్ష్మణ్ ,శివరాత్రి హనుమంతు ఒక కేసులో 15 ఏండ్లుకు పైగా శిక్ష అనుభవిస్తున్నారని, వారిని విడుదల చేసేందుకు తమ ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా ప్రయత్నిస్తోందని కేటీఆర్‌‌ తెలిపారు. ఈ కేసులో ప్రాణాలు కోల్పోయిన నేపాల్‌కు చెందిన బాధిత కుటుంబానికి షరియా చట్ట ప్రకారం దియ్యా (బ్లడ్ మనీ) కింద రూ.15 లక్షలు అందజేశామని చెప్పారు.

 నేరస్తులుగా గుర్తించిన వారికి క్షమాభిక్ష పెట్టేందుకు ఆ కుటుంబం ఇచ్చిన అంగీకార పత్రాన్ని దుబాయ్‌ ప్రభుత్వానికి గతంలోనే అందజేశామని ఆయన తెలిపారు. అయితే, కొన్ని కారణాలు, నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆ దేశ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష పెట్టలేదని వివరించారు. వీరి క్షమాభిక్ష పిటిషన్‌ను దుబాయ్‌ కోర్టు తిరస్కరించిందని, దీంతో ఆ దేశ రాజు షేక్ మహ్మద్ ద్వారా క్షమాభిక్ష పొందేందుకు ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్‌‌ విజ్ఞప్తి చేశారు. ఇందుకు దుబాయ్‌లోని భారత కాన్సుల్ కార్యాలయం చొరవ తీసుకోవాలన్నారు. మంత్రి విజ్ఞప్తికి దుబాయ్‌లో భారత కాన్సుల్ జనరల్ రామ్ కుమార్ సానుకూలంగా స్పందించారు.