బీఆర్ఎస్ లో అసమ్మతి పంచాయితీలన్నీ ఆయన దగ్గరికే

బీఆర్ఎస్ లో అసమ్మతి  పంచాయితీలన్నీ ఆయన దగ్గరికే
  • పార్టీలో అసమ్మతి  పంచాయితీలన్నీ ఆయన దగ్గరికే
  • సీఎం కేసీఆర్​తో చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని అర్జీలు
  • ప్రగతి భవన్ కు వెళ్లలేని వారంతా ఆయనతోనే సంప్రదింపులు

కరీంనగర్, వెలుగు:  పార్టీలో అగ్రనేత హోదా ఉంటే ఆ కిక్కే వేరనుకుంటారు లీడర్లు. కానీ కొన్నిసార్లు ఆ పెద్దరికం వల్లే అనేక  సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్​తమ పార్టీకి, సీఎం కేసీఆర్ కు ప్రతినిధిగా భావించే మాజీ ఎంపీ, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కూడా ప్రస్తుతం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.  తమకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని కొందరు, తమ ఎమ్మెల్యేను మార్చాల్సిందేనని మరికొందరు, మా ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇప్పించాలని ఇంకొందరు ఆయన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులతోపాటు, సిట్టింగులు కూడా వచ్చి టికెట్ల కోసం వెంటపడుతుండడంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి పంపుతున్నారనే  ప్రచారం జరుగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, పార్టీ నేతలకు మధ్య గొడవలు ముదురుతుండడంతో ఎన్నికల వేళ వినోద్ ట్రబుల్ షూటర్ అవతారమెత్తాల్సి వస్తోంది.   

అసమ్మతి పంచాయితీలన్నీ వినోద్ దగ్గరికే.. 

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న క్రమంలో జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా అసమ్మతి స్వరాలు వినిపించాయి. దీంతో అన్ని చోట్ల అసమ్మతి నేతలను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమారే కూర్చొబెట్టి మాట్లాడారు.

‌‌‌‌‌‌‌చొప్పదండి నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలు ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఇవ్వొద్దని, ఆయనకు తప్పా వేరే ఎవరికీ ఇచ్చినా సహకరిస్తామని నేరుగా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో వినోద్ కుమార్ రంగంలోకి దిగి, మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి చొప్పదండి అసంతృప్త నేతలు, ఎమ్మెల్యే రవి శంకర్ తో  కరీంనగర్ లోని ఓ హోటల్ లో మీటింగ్ పెట్టారు. వినోద్, మంత్రి గంగుల సమక్షంలోనే ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఎన్నికల టైంలో ఇలాంటి ఘర్షణలు ప్రతిపక్షాలకు ఉపయోగపడ్తాయని, అన్నీ తాను చూసుకుంటానని సర్దిచెప్పి పంపినట్లు తెలిసింది. ఆ మీటింగ్ తో చొప్పదండి వివాదం సద్దుమణిగినట్లయింది. 

మానకొండూరు నియోజకవర్గం టికెట్ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ఆరేపల్లి మోహన్ మధ్య పోటీ నెలకొంది. దీంతో ఈ ఇద్దరిని కూడా పెద్ద మనిషిగా వినోద్ కుమారే సమన్వయం చేయాల్సి వస్తోంది. ఇటీవల గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో జరిగిన డబుల్ రోడ్డు పనుల ప్రారంభోత్సవ మీటింగులో ఎమ్మెల్యే రసమయికే మళ్లీ టికెట్ ఇవ్వడంతోపాటు గెలిచాక మంత్రి పదవి ఇప్పించాలని  స్థానిక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి వినోద్ కుమార్ ను కోరారు. 

అక్కడే స్టేజీ మీద మానకొండూరు బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కూడా ఉండడంతో వినోద్ కుమార్ సమయ స్ఫూర్తితో  ‘పెద్ద మనిషి’ తరహాలోనే సమాధానం చెప్పారు. టికెట్ల వ్యవహారం సీఎం చూసుకుంటారని, గెలవలేని సిట్టింగ్ లను మాత్రమే మారుస్తారని చెప్తూనే ఆరెపల్లి మోహన్ కూడా సీఎం కేసీఆర్ కు సన్నిహితుడని, ఆయనకు కూడా తగిన ప్రాధాన్యం దక్కుతుందని ముగించారు.  జడ్పీ చైర్ పర్సన్  కనుమల్ల విజయపై అవిశ్వాస తీర్మానానికి రెడీ కావడంతో జడ్పీటీసీలను  పిలిచి మంత్రి గంగుల సమక్షంలో వినోద్ కుమార్ పంచాయితీ పెట్టారు. మంత్రి గంగుల, వినోద్ కుమార్ నచ్చజెప్పడంతో అధికార పార్టీ  జడ్పీటీసీలు అవిశ్వాసంపై వెనక్కి తగ్గారు. 

ఉమ్మడి వరంగల్​ జిల్లాలోనూ..

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​కు వ్యతిరేకంగా కొంతకాలంగా అసమ్మతి గళం వినిపిస్తోంది.  ఉద్యమకారులను, సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ఈసారి టికెట్ ఇవ్వొద్దంటూ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్​, పోలపల్లి రామ్మూర్తి, పలువురు ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ కు నెల రోజుల కింద ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అసమ్మతి నాయకులతో మాట్లాడి సర్దిచెప్పినప్పటికీ.. ఇంకా వివాదం సద్దుమణగలేదు.

టికెట్ల కోసం ఆర్జీలు.. 

కేసీఆర్ కు దగ్గరి మనిషిగా వినోద్ కుమార్ కు పేరుండడంతో ఆయన చెవిలో వేస్తే.. కేసీఆర్ చెవిలో వేసినట్లేనన్న నమ్మకం ఆ పార్టీ లీడర్లలో ఉంది. అందుకే ప్రతీ ఎమ్మెల్యే, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, చోటా మోటా లీడర్లు.. వినోద్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన దృష్టిలో పడేందుకు తాపత్రయపడ్తుంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ కు చెందిన పలువురు నాయకులు  ఆయనకు ఆర్జీలు పెట్టుకుంటున్నారు. సీఎం కేసీఆర్ తో చెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని కోరుతున్నారు. ప్రగతి భవన్ కు వెళ్లలేని ఆశావహులంతా వినోద్ తోనే సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తానే పోటీ చేసే ఆలోచనలో ఉండడంతో నొప్పించక.. తానొవ్వక అనే రీతిలో పార్టీ నేతలకు సమాధానం చెప్తూ వినోద్ ముందుకు సాగుతున్నారనే ప్రచారం సాగుతోంది.