క్యూర్లో ఎల్ఐజీ, ఎంఐజీ టవర్లు!..హౌసింగ్ బోర్డు భూముల్లో నిర్మాణాలు

క్యూర్లో ఎల్ఐజీ, ఎంఐజీ టవర్లు!..హౌసింగ్ బోర్డు భూముల్లో నిర్మాణాలు
  • అర్బన్ ఏరియాలో పేదలకు లక్ష ఇండ్లు
  • 10 నుంచి15 ఫ్లోర్లతో నిర్మాణం.. ఒక్కో బ్లాక్ లో 140 ఫ్లాట్లు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డు పరిధిలోని ప్రాంతాన్ని కోర్‌‌ అర్బన్‌‌ రీజియన్‌‌ (క్యూర్)గా విభజించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం గృహ నిర్మాణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హౌసింగ్ బోర్డుకు చెందిన 500 ఎకరాల భూముల్లో ఏకంగా లక్ష ఫ్లాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

క్యూర్ పరిధిలోని ప్రభుత్వ భూమిని పూర్తి స్థాయిలో వినియోగించుకుని, లక్ష మందికి పైగా లబ్ధిదారులకు గృహ వసతి కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా కేవలం లోయర్ ఇన్‌‌కమ్ గ్రూప్ (ఎల్ఐజీ ), మిడిల్ ఇన్‌‌కమ్ గ్రూప్ (ఎంఐజీ) వర్గాల కోసమే ప్రత్యేకంగా ఈ టవర్లను నిర్మించనున్నారు.  

భూమి కొరతను అధిగమించేందుకు వర్టికల్ గ్రోత్ (నిలువు నిర్మాణాలు) పద్ధతిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఒక్కో టవర్‌‌ను 10 నుంచి 15 ఫ్లోర్ల (అంతస్తుల) సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఒక్కో టవర్ లో  140 ఫ్లాట్లు ఉంటాయని హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. 

ఇండ్ల కోసం12 లక్షల మంది అప్లై.. 

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 12 లక్షల మంది ప్రజా పాలనలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే ఇందులో సొంత జాగా ఉన్న వాళ్లు కేవలం 18 వేల మంది మాత్రమే ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ఇక గ్రేటర్ లో జీప్లస్ 3 పద్దతిలో ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం వివిధ నియోజకవర్గాల్లో  19 స్లమ్స్ ను అధికారులు ఎంపిక చేశారు. అయితే, ఈ స్థలాలు కోర్టు వివాదాలు ఉండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 

సింగిల్, డబుల్ నిర్మాణాలకు బిల్డర్ల వెనుకడుగు..హైదరాబాద్‌‌లో  సింగిల్, డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ల నిర్మాణాలు తగ్గుతున్నాయి. ప్లాట్ల ధరలు అధికంగా ఉండటం, నిర్మాణ ఖర్చు భారీగా పెరగడం, రియల్ ఎస్టేట్ భూమ్ తగ్గడం వంటి కారణాలు ఉన్నాయని బిల్డర్లు చెబుతున్నారు.  రూ.50 లక్షలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దొరకని పరిస్థితి ఉంది. 1, 2 బీహెచ్‌‌కే ఫ్లాట్లు క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. 2018లో గృహ విక్రయాల్లో సామాన్య, మధ్య తరగతి ఇండ్ల వాటా 54 శాతం ఉండగా, ఇప్పుడు 26 శాతానికి పడిపయింది. ఈ నేపథ్యంలో ఎల్ఐజీ, ఎంఐజీ నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.