
- త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్
- కాకతీయ కళా సంపద భావి తరాలకు తెలిసేలా ప్లాన్
- నిర్మల్ కోట అభివృద్ధిపైనా ఫోకస్.. డీపీఆర్ కోసం స్పెషల్ టీమ్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ చరిత్ర, కాకతీయ కళా వైభవానికి ప్రతీకగా నిలిచే కోటగుళ్లు టెంపుల్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో కోటగుళ్లు ఆలయం ఉంది. కాకతీయుల కాలంనాటి ఈ ఆలయం వారి కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. రాతి కట్టడాలు, శిల్ప కళ, నిర్మాణ శైలి నాటి గొప్పదనాన్ని చాటుతున్నది. ఈ ఆలయానికి పర్యాటక శోభను తేవడంతోపాటు చారిత్రక కట్టడాలను రక్షించి భావితరలకు పరిచయం చేయాలని పర్యాటకశాఖ సంకల్పించింది.
ఈ మేరకు ఆలయ పునరుద్ధరణకు అవసరమైన పనులకు డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను రూపొందించింది. పర్యాటకులకు మౌలిక వసతులు కల్పించేలా కూడా ప్లాన్ రెడీ చేసింది. శిథిలమైన గోడలు, శిల్పాల పునరుద్ధరణ, లైటింగ్, సౌండ్ షో, హోటల్, గెస్ట్‌హౌజ్ లు, వాక్ వేలు, పార్కు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, రోడ్లు, పార్కింగ్ వంటి ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. కాకతీయ శిల్పకళను ప్రదర్శించే మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రూ.30 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ సిద్ధం చేయగా.. త్వరలో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.
కోటగుళ్లును రామప్ప ఆలయం (యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్)తో లింక్ చేసి పర్యాటక సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే మేడారం, రామప్ప ఆలయానికి టూరిస్ట్‌లు వస్తుండగా.. ఈ మార్గంలో ఉన్న కోటగుళ్లును కూడా అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే చాన్స్ ఉంది. ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నిర్మల్ కోట అభివృద్ధిపైనా ఫోకస్..
కోటగుళ్లుతో పాటు నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక నిర్మల్ కోటను కూడా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నిర్మల్ ఫోర్ట్ (శ్యామ్‌గఢ్ ఫోర్ట్) కూడా కాకతీయుల కాలం నాటిదే. ఈ పురాతన కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దీన్ని పునరుద్ధరించి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని పర్యాటక శాఖ భావిస్తున్నది. ఫోర్ట్ కు అవసరమైన పనులకు డీపీఆర్ రెడీ చేస్తున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ ప్రత్యేక టీమ్‌లను నిర్మల్‌కు పంపించింది.
ఫోర్ట్ మరమ్మతులు, లైటింగ్ సిస్టమ్, పాత్‌వేలు, క్యాఫెటీరియా, తాగునీరు, టాయిలెట్లు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫోర్ట్ కు15 కి.మీ. దూరంలో మరో 4 ఫోర్ట్‌లు (ఖిల్లా గుట్ట, భైరవ గుట్ట, బటీస్‌గఢ్, సోనాగఢ్) ఉన్నాయి. వీటిని బాసర, కుంటాల జలపాతం, కడెం ప్రాజెక్ట్ తో లింక్ చేసి సర్క్యూట్ చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో 27 పర్యాటక సర్క్యూట్‌లు ఏర్పాటు చేస్తుండగా.. వీటిలో టెంపుల్, హెరిటేజ్, ఎకో టూరిజం వంటివి ఉన్నాయి. కోటగుళ్లు, నిర్మల్ ఫోర్ట్ హెరిటేజ్ కేటగిరీలోకి వస్తాయి.