శభాష్ పోలీస్.. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులు

శభాష్ పోలీస్.. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన పోలీసులు

నెట్​వర్క్, వెలుగు: లా అండ్​ ఆర్డర్​ కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు.. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలోనూ ముందున్నారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండ్రోజులుగా నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు.. వంతెనలు, కల్వర్టుల వద్ద బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. ఈ క్రమంలో వరదలో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు. పలుచోట్ల వాగుల్లో కొట్టుకుపోయినోళ్ల కోసం గాలింపు చర్యలు చేపడ్తున్నారు. వరదలు ముంచెత్తిన గ్రామాలు, కాలనీల్లో రెస్క్యూ చేపట్టి.. చిన్నారులు, వృద్ధులను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు.

రోడ్లపై కూలిన చెట్లను తొలగించడంతోపాటు రోడ్లు కొట్టుకపోయిన చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాలను మళ్లించడం ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్​ను క్లియర్​చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎక్కడెక్కడ కాపాడారంటే.. 

మహబూబాబాద్ జిల్లా సీరోల్​ మండలం సీతారాంనాయక్​తండాలో ఆకేరు వాగు పోటెత్తి 100 మంది చిక్కుకపోయారు. విషయం తెలుసుకున్న సీరోల్ ఎస్ఐ నగేశ్​ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక డోలీల ద్వారా బాధితులను బయటకు తెచ్చారు. 

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం వద్ద వరదలో చిక్కున్న మూడు బస్సుల వద్దకు చేరుకున్న కోదాడ పోలీసులు.. బస్సుల్లో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రయాణికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు.

నాగర్​కర్నూల్​జిల్లా తాడూరు మండలం సిరసవాడ గ్రామానికి చెందిన గొర్ల కాపర్లు ఆంజనేయులు, చిన్న మల్లయ్య 30 గొర్రెలతో శనివారం రాత్రి దుందుభి వాగు మధ్యలో చిక్కుకుపోగా... కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్లను సురక్షితంగా తీసుకొచ్చారు.  

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం లెనిన్​నగర్​లో ఇండ్లలోకి వరద రావడంతో శనివారం రాత్రి చేర్యాల సీఐ ఎల్.శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు రెవెన్యూ అధికారులతో  కలసి 30 మందిని  సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆదివారం భారీ వర్షాల కారణంగా వారందరికీ అక్కడే బస ఏర్పాటు చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామ సమీపంలో  పెద్దవాగు వరదలో చిక్కుకున్న ముగ్గురిని పోలీసులు కాపాడారు. శనివారం గొర్రెలను మేపడానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన రామస్వామి, రామకృష్ణ, రేణుక వరదలో చిక్కుకుపోయారు. ఆదివారం పెద్దకొత్తపల్లి ఎస్సై సతీశ్, హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్, కానిస్టేబుల్ కల్యాణ్.. ఆ ముగ్గురితో పాటు గొర్రెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.