గుజరాత్​కు టెర్రరిస్టు అజ్గర్ అలీ

గుజరాత్​కు టెర్రరిస్టు అజ్గర్ అలీ

నల్గొండ టౌన్, వెలుగు: ఐఎస్ఐ టెర్రరిస్టు, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అజ్గర్ అలీని గురువారం పటిష్ట భద్రత మధ్య నల్గొండ పోలీసులు గుజరాత్​కు తరలించారు. గుజరాత్ హోం మంత్రి హారెన్ పాండ్యా హత్య కేసులో నిందితుడుగా ఉన్న అజ్గర్ ఆలీకి ఇటీవల గుజరాత్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో అజ్గర్ అలీని తమ ముందు హాజరు పరచాలని నల్గొండ జిల్లా పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో అలీని అహ్మదాబాద్ కోర్టులో హాజరు పరిచినట్లు నల్గొండ జిల్లా ఇన్​చార్జ్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు

ప్రణయ్ హత్య కేసులో మారుతీరావు, అబ్దుల్ బారీలతోపాటు అజ్గర్ అలీ నిందితుడు. పీడీ యాక్ట్ కింద వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అలీ ఇటీవల బెయిల్ పై విడుదల అయ్యాడు. బయటికొచ్చి నేరాలు కొనసాగించాడు. ఇటీవల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. బెదిరింపులకు పాల్పడడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటివి చేశాడు. ఈ కేసులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే గుజరాత్ కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి.