సర్పంచ్ ఎన్నికలపై పోలీసుల ఫోకస్‌‌‌‌ : డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

సర్పంచ్ ఎన్నికలపై పోలీసుల ఫోకస్‌‌‌‌ : డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • సీపీలు, ఎస్పీలతో  డీజీపీ శివధర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా జరుగనున్న పంచాయతీ ఎన్నికలపై పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఫోకస్ పెట్టింది. గురువారం నుంచి తొలివిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించింది. ఇందులో భాగంగా డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు కృషి చేయాలని సూచించారు. 

పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో అదనపు డీజీపీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌) మహేశ్ భగవత్, మల్టీ జోన్ 2 అడిషనల్ డీజీపీ డీఎస్ చౌహాన్, మల్టీ జోన్– 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీ రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.