ప్రజా ప్రభుత్వం : బుల్డోజర్లతో.. ప్రగతిభవన్ కంచెలు బద్దలు

ప్రజా ప్రభుత్వం : బుల్డోజర్లతో.. ప్రగతిభవన్ కంచెలు బద్దలు

బుల్డోజర్లు దిగాయి.. కోట కంచె బద్దలైంది.. ప్రగతిభవన్ ఎదుట ఉన్న కంచెలు, సెక్యూరిటీ మెష్ లను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు అధికారులు. ఇన్నాళ్లు ప్రగతి భవన్ అంటే సీఎం అధికారిక నివాసంగా.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఈ భవనం.. ఇప్పుడు ప్రజా వేదిక అవుతుంది.. అందరికీ ప్రవేశం కల్పిస్తూ.. సెక్యూరిటీని తొలగిస్తున్నారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. ప్రగతిభవన్ కంచెలను తొలగించటానికి పెద్ద ఎత్తున కార్మికులు రంగంలోకి దిగారు. శరవేగంగా సాగుతున్న ఈ పనులు.. రెండు రోజుల్లో పూర్తవుతాయని చెబుతున్నారు అధికారులు. బేగంపేట్  ప్రగతిభవన్ గేట్లను గ్యాస్ కట్టర్లు, జేసీబీలతో తొలగిస్తుండటంతో.. పోలీసులు భారీ సంఖ్య అక్కడి పరిస్థితిని సమీక్షిస్తూ.. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రగతిభవన్ కంచెలను తొలగించి లారీలు, ట్రాక్టర్లల్లో తరలిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రగతిభవన్ దగ్గర ఆంక్షలుఎత్తేశారు. పదేళ్లుగా ప్రగతి భవన్ ముందున్న కంచెలు తొలగిస్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటులో స్పష్టత రాగానే.. సెక్రటేరియట్, ప్రగతిభవన్  గురించి ప్రస్తావించారు రేవంత్ రెడ్డి.  మాపాలనలో సెక్రటేరియట్, ప్రగతిభవన్ తలుపులు ప్రజలకోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయని ప్రకటించారు. ప్రగతిభవన్ పేరును  డా. అంబేద్కర్ ప్రజాభవన్గా పేరు మారుస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా చర్యలు ఆ దిశగా చర్యలు చేప్టటారు పోలీసులు.  ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ప్రగతి భవన్​ దగ్గర బుల్డోజర్​ లతో కంచెలు తొలగిస్తున్నారు.  దీంతో నిజంగా ప్రజా పాలన వచ్చిందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు నిర్భయంగా ప్రగతిభవన్కు రావొచ్చని..తమ ఫిర్యాదులను సీఎంకు విన్నవించేందుకు స్వేచ్ఛ ఉందని తెలిపేందుకే  కంచె తొలగింపు అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.

సీఎం అయితే ప్రగతిభవన్ కంచెలు బద్దలు కొడతాను.. సామాన్యులకు ప్రవేశం కల్పిస్తాను అంటూ రేవంత్ రెడ్డి పలుసార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రమాణ స్వీకారం కంటే ముందే.. ఈ పనిని పూర్తి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కంచెను తొలగిస్తే ఇక్కడ ఆ ప్రాంతం వెళ్లే వాహన దారులకు కొంత ఉపశమనం దొరికే అవకాశం ఉందటున్నారు.