
తెలంగాణ రాజకీయ తెరమీద ‘బలహీన వర్గాలు’ ఇప్పుడు బలమైన పదబంధంగా మారింది. అన్ని పార్టీల రాజకీయం ‘బీసీ’ల చుట్టూ తిరుగుతోంది. బీసీలు తెలంగాణలో బహుళ సంఖ్యాకులని కులగణన తేల్చడంతో... ఓటుబ్యాంకు రాజకీయం ఒక్కసారిగా ఒళ్లు విరుచుకుంది. బీసీ రిజర్వేషన్ బిల్లు, 50 శాతం రిజర్వేషన్ క్యాప్ తొలగించే ఆర్డినెన్స్‌తో కాంగ్రెస్ ‘ఎజెండా సెట్’ చేసింది. లోగడ రిజర్వేషన్ తగ్గింపు నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు గిలగిల్లాడుతోంది. ‘బీసీ సీఎం’ అని ముందే కూసిన కోయిల బీజేపీ,
కేంద్రంలో పాలకపక్షంగా ఉండి... బిల్లు, ఆర్డినెన్స్ ఆమోదంలో జరుగుతున్న ప్రస్తుత జాప్యానికి ఇరుకునపడింది. స్థానిక సంస్థల
ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ... ఈ రాజకీయ స్పర్ధ ఎవరిని ముంచుతుంది? మరెవరిని తేలుస్తుంది? అన్నది వారి విశ్వసనీయత,ప్రజాదరణబట్టి తేలాల్సిందే!
తెలంగాణలో సామాజిక న్యాయరాగంతో సోషల్ ఇంజినీరింగ్‌కు ప్రాధాన్యత పెరిగింది. అధికార కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీవరకు బీసీ పాట పాడుతుంటే, ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ జాగృతి కూడా బీసీ గళమెత్తుకున్నాయి. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తమపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు యత్నిస్తోంది. సోషల్ ఇంజినీరింగ్ రాజకీయాలు ఊపందుకున్నాయి.
దేశవ్యాప్త కులగణన డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, తాను అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన జరిపి, బీసీ సామాజిక వర్గాలకు విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పెంపుపై 2025 మార్చి 17వ తేదీన శాసనసభలో అన్ని పార్టీల మద్దతుతో బిల్లు ఆమోదించిన ప్రభుత్వం మార్చి 22న గవర్నర్‌కు పంపగా, ఆయన మార్చి 30న రాష్ట్రపతికి పంపారు. మరోవైపు 2018 పంచాయతీ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధనను సవరిస్తూ జులై 10న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ముసాయిదాను ఆమోదించి, జులై 14న గవర్నర్ కు పంపింది. రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ జారీ బీసీ అంశాన్ని ఎజెండా చేశాయి.
బీజేపీకి బీసీ కష్టాలు
సెప్టెంబర్ గడువుతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఎన్నికలకు సిద్ధమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ రూపొందించింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ కేంద్రానికి పంపించారు. రిజర్వేషన్ల బిల్లు, ఆర్డినెన్స్ రెండూ కేంద్ర ప్రభుత్వం వద్దనే ఉండడంతో తెలంగాణ బీజేపీకి బీసీ కష్టాలు రెట్టింపయ్యాయి. జాతీయ స్థాయిలో బీజేపీపై ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేత ప్రజంటేషన్ ఇప్పించి, తెలంగాణను మోడల్‌గా తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తెలంగాణ కులగణన, బీసీ రిజర్వేషన్ అస్త్రాలను బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగించి లబ్ధి పొందాలన్నది ఏఐసీసీ వ్యూహం. దీనికి కొనసాగింపుగా సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆగస్టు మొదటివారంలో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతిని కలవాలని, సానుకూలత రాకపోతే ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి పక్షాలను కలుపుకొని నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది.
బీఆర్ఎస్కు కష్టాలు
తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను లోగడ 34 నుంచి 23 శాతానికి తగ్గించి ఆ వర్గాలకు బీఆర్ఎస్ రాజకీయంగా అన్యాయం చేసిందని, ఇప్పుడు కూడా 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని కాంగ్రెస్ ఆ పార్టీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. బీఆర్ఎస్ కు ఒక్క కాంగ్రెస్ వైపు నుంచి ఒత్తిడే కాకుండా తెలంగాణ జాగృతి నుంచి కూడా బీసీ విషయంలో ఇంటిపోరు పెరిగింది. వెనుకబడకూడదని బీఆర్ఎస్ కూడా బీసీ బాట పట్టింది. తెలంగాణ ఉద్యమ తరహాలో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై పోరుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ బీసీ నేతలు ఇప్పటికే ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రతివ్యూహం
ఆగస్టు 8న కరీంనగర్ లో బీసీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్, రాష్ట్రపతిని కలిసేందుకూ సిద్ధమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్ట జూస్తోంది. నరేంద్ర మోదీని పెద్దన్నగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, బీసీ బిల్లు ఆమోదానికి ఆయనపై ఒత్తిడి తేలేకపోయారని, రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి పంపి 3 నెలలైనా, సీఎం ఈ విషయంలో రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని ప్రత్యేకంగా కలిసి వినతి పత్రాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఉమ్మడి పది జిల్లాల్లో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తోంది. లోగడ తమిళనాడు సీఎం జయలలిత పంథాలో కాంగ్రెస్ నేతలు నడిచి, బీసీ రిజర్వేషన్లు పూర్తయ్యేవరకు ఢిల్లీ నుంచి తెలంగాణకు తిరిగి రావద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తోంది.
పంటికింద రాయి కవిత
బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉంటున్న కవిత బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్‌తో సమానంగా బీఆర్ఎస్ నూ చికాకుపర్చారు. భౌగోళిక తెలంగాణ ఏర్పడ్డా సామాజిక తెలంగాణ రాలేదని ఆమె చేసిన ప్రకటనతో బీఆర్ఎస్లో గందరగోళానికి గురైంది. తెలంగాణ జాగృతి పేరున బీసీ నినాదంతో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కవిత చేపట్టిన ఒత్తిడి చర్యలతో బీఆర్ఎస్కూ ఇబ్బందులు తప్పలేదు. ఆమె బీసీ సంఘాల నేతలతో జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ధర్నాచౌక్‌లో మహాధర్నా నిర్వహించిన కవిత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో భాగంగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే, బీజేపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, వామపక్ష నేతలను కలుసుకున్నారు.
తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాలో కూడా బీసీ గళం వినిపించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో కవిత సఫలమయ్యారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక ఎన్నికలు జరపొద్దని డిమాండ్ చేసిన కవిత జులై 17న తలపెట్టిన రైలురోకో కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. రైలురోకో కంటే ముందే ప్రభుత్వం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవడంతో రైలురోకో వాయిదా వేసిన కవిత చేపట్టిన సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచాయి. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఆగస్టు 4న హైదరాబాద్‌లో 72 గంటల నిరాహార దీక్ష చేపట్టాలని కవిత నిర్ణయించిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా భారీ కార్యక్రమాలు ప్రకటించడం గమనార్హం.
బీజేపీ ఉక్కిరిబిక్కిరి
బీసీ రిజర్వేషన్ల బంతి కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉండడంతో రాష్ట్ర బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదంటూ ఆ పార్టీ అగ్రనేతలు చేస్తున్న ప్రకటనలకు తోడు గవర్నర్ ఆర్డినెన్స్ కేంద్రానికి పంపడంతో జరుగుతున్న జాప్యం వారిని మరింత ఇరుకున పెడుతోంది. ఇవన్నీ చూపి బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు కాంగ్రెస్ ఇప్పటికే ఢిల్లీ వేదికగా నిరసనలకు పిలుపిచ్చింది. 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకే పోతే, బీసీలకు 32 శాతమే లభిస్తుందని, అసలైన బీసీలకు అన్యాయం జరగకూడదని బీజేపీ వాదిస్తోంది.
ఇది ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టుందని, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లుబాటు కావని బీజేపీ ప్రకటిస్తుంటే, ఆ పార్టీ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ సామాజిక వర్గంలో ముస్లింలున్నారని, జాతీయ పార్టీ అయిన బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తీరున వ్యవహరిస్తోందనే విమర్శలకు నాయకత్వం జవాబు చెప్పుకోవాల్సి వస్తోంది. ఈ ఆరోపలణలన్నింటినీ తిప్పి కొట్టేందుకు స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున 42 శాతం టికెట్లను బీసీ అభ్యర్థులకే కేటాయిస్తామని బీజేపీ ప్రకటించింది.
అదే కీలక ఎజెండా
తెలంగాణలో బీజేపీ చేసే ప్రకటనలకు, ఆచరణకు పొంతన ఉండదనే పేరుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి, ఎన్నికల ముందరే బీసీ నేత అయిన బండి సంజయ్‌ని అధ్యక్షుడిగా తొలగించింది. ఈసారి అధ్యక్ష పీఠం కోసం బీసీ నేతలు పోటీపడితే, వారిని కాదని అగ్రవర్ణాలకు కట్టబెట్టింది. చివరికి బీజేఎల్పీ నేత కూడా అగ్రవర్ణాలవారే.
బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య బీజేపీ ఎంపీగా ఉన్నా ఆయనెప్పుడూ పార్టీ కార్యాలయం గడప కూడా తొక్కినట్టు లేదని పార్టీలోనే గుసగుస! ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీకి బీసీ మద్దతు కావాలంటే ఆచరణలో ఆ వర్గాలకు పార్టీ దగ్గర కావాల్సి ఉంది. కులగణన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56 శాతానికి పైగా ఉన్న బీసీ సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు అందరూ కసరత్తు మొదలెట్టారు. ఇప్పటికిప్పుడు బిల్లుకు చట్టబద్ధత అవకాశాలు లేని దశలో, ఆర్డినెన్స్ పై గవర్నర్ నిర్ణయంపైనే ఆసక్తి నెలకొంది. నిర్ణయం ఎలా ఉన్నా రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశమే కీలక ఎజెండాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
సామాజిక వేడిని పుట్టించిన కాంగ్రెస్
రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చాలనే డిమాండ్‌తో మొదలై, ఆర్డినెన్స్ ఆమోదం వరకు ఈ పరిణామాలు రాష్ట్రంలో సామాజిక వేడిని పుట్టిస్తున్నాయి. బీసీలకు తాము సామాజిక న్యాయం చేస్తుంటే బీజేపీ మాత్రం వారి ‘నోటి కాడ ముద్ద లాగేస్తోంది’ అని కాంగ్రెస్ ఆ పార్టీని ఇరుకున పెడుతోంది. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ గత ఏప్రిల్‌లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను కాంగ్రెస్ నడిపించింది. ఆ ధర్నాకు గైర్హాజరైన బీఆర్ఎస్, బీజేపీలు బీసీలకు వ్యతిరేకంగా జతకట్టాయని విమర్శించింది.
- దిలీప్ రెడ్డి,పొలిటికల్ ఎనలిస్ట్, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రిసెర్చ్ సంస్థ-