అరికెపూడి vs కౌశిక్​రెడ్డి.. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు

అరికెపూడి vs కౌశిక్​రెడ్డి..  ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • అనుచరులతో కౌశిక్​రెడ్డి ఇంటికి చేరుకున్న గాంధీ
  • టమాటాలు, గుడ్లు, రాళ్లతో దాడి.. పూలకుండీలు ధ్వంసం
  • ఎమ్మెల్యే గాంధీ, అనుచరులపై కేసులు నమోదు
  • పోలీసుల నిర్లక్ష్యంతోనే దాడి జరిగిందన్న హరీశ్ రావు
  • సీపీ ఆఫీసులో బైఠాయింపు.. మా ప్రభుత్వం 
  • వచ్చాక చూస్కుందామని వార్నింగ్

గచ్చిబౌలి, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్​రెడ్డి మధ్య మాటల యుద్ధం ముదిరి దాడి చేసుకునేవరకూ వెళ్లింది. కౌశిక్​రెడ్డి ఇంటిపైకి గాంధీ తన అనుచరులతో రావడం, పోలీసులు అడ్డుకోవడం, ధర్నా చేయడం, గాంధీ అనుచరులు రెచ్చిపోయి కౌశిక్​ఇంటి అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేయడం లాంటి ఘటనలతో ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్​అగ్ర నేతలు కౌశిక్​రెడ్డిని పరామర్శించేందుకు వచ్చి ఘటనకు పోలీసులే బాధ్యులంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సైబారాబాద్​సీపీ ఆఫీసులో బైఠాయించారు. దీంతో అందరినీ అరెస్ట్​ చేసి వివిధ పోలీస్​స్టేషన్లకు తరలించారు.

Also Read:-ఎంబీబీఎస్ సీట్లపై యూజీసీ పిడుగు

ఎమ్మెల్యేల పరస్పర సవాళ్లు 

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పోస్టు ఇచ్చింది. ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పోస్టు ఇవ్వాలని, కానీ, సీఎం రేవంత్​రెడ్డి బీఆర్ఎస్​నుంచి కాంగ్రెస్​లో చేరినందుకే గాంధీకి పీఏసీ చైర్మన్ ఇచ్చారని బీఆర్ఎస్​ లీడర్లు విమర్శించారు. దీనిపై పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే గాంధీ కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని, ఆ పార్టీ కండువా కప్పుకోలేదని చెప్పారు. తాను సీఎంను కలిసినప్పుడు కప్పింది కాంగ్రెస్ కండువా కాదని వివరణ ఇచ్చారు. దీనికి హుజూరాబాద్​ ఎమ్మెల్యే బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి స్పందిస్తూ గాంధీ కాంగ్రెస్​లో చేరలేదంటున్నాడని, అదే నిజమైతే తాను కార్యకర్తలతో కలిసి గురువారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వస్తానని, అక్కడ గాంధీకి బీఆర్ఎస్ కండువా కప్పి, ఇంటిపై బీఆర్ఎస్​ జెండా ఎగరేస్తాననన్నారు. తర్వాత తెలంగాణ భవన్​కు వెళ్లి ప్రెస్​మీట్​పెట్టి కేసీఆర్​ఇంటికి వెళ్దామని సవాల్​ విసిరారు.

నా ఇంటికి రాకపోతే నీ ఇంటికొస్త

కౌశిక్​రెడ్డి సవాల్​కు స్పందించిన గాంధీ వివేకానందనగర్​లో ఉన్న తన ఇంటికి 11 గంటల వరకు రాకపోతే తానే 12 గంటలకు కొండాపూర్​లోని ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి ఇంటికి వస్తానన్నారు. బ్రోకర్లు, కోవర్టులు వచ్చి తన ఇంటిపై జెండా ఎగరవేస్తా అంటే ఊరుకునేది లేదన్నారు. 

కౌశిక్​రెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు

ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లతో గురువారం ఉదయం సైబరాబాద్ పోలీసులు కొండాపూర్​లోని కొల్లు లక్సూరియా విల్లాస్ వద్ద, వివేకానంద నగర్​లోని ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్​రెడ్డిని బయటకు వెళ్లకుండా హౌస్​అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గాంధీ, తన అనుచరులతో కలిసి కొండాపూర్​లోని కౌశిక్​రెడ్డి ఇంటికి భారీ కాన్వాయ్​తో చేరుకున్నారు. విల్లాస్​ మెయిన్​ గేట్​వద్ద సైబరాబాద్​ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాంధీ అనుచరులు గేట్​ను తోసుకుంటూ లోపలికి చొచ్చుకుపోయారు. 

కౌశిక్​రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ల దాడి 

ఎమ్మెల్యే గాంధీ అనుచరులు కొందరూ కౌశిక్​రెడ్డి ఇంటిపైకి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. అక్కడే ఉన్న కౌశిక్​రెడ్డి అనుచరులు గాంధీ అనుచరులపైకి గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గాంధీ, అతని అనుచరులను మాదాపూర్ ఏసీపీ, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​అదుపులోకి తీసుకొని రాయదుర్గం పీఎస్​కు తరలించారు. తర్వాత అక్కడి నుండి నార్సింగి పీఎస్​కు తీసుకువెళ్లారు.

సైబరాబాద్​ సీపీ ఆఫీస్​కు బీఆర్ఎస్ నేతలు

విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు హరీశ్​రావు, సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్​రెడ్డి, వేముల ప్రశాంత్​రెడ్డి, వివేకానందగౌడ్, మాధవరం కృష్ణారావు, పల్లా రాజేశ్వర్​రెడ్డి, మాగంటి గోపీనాథ్ తదితరులు కౌశిక్​రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ దాడిని ఎమ్మెల్యే గాంధీ, అతడి అనుచరులు చేసినట్లుగా భావిస్తలేమని, సీఎం రేవంత్​రెడ్డి చేయించినట్లుగా భావిస్తున్నామన్నారు.  మాదాపూర్​ఏసీపీ, గచ్చిబౌలి సీఐలను సస్పెండ్​ చేయాలన్నారు.  ప్రతి దాడులు చేసే సత్తా తమకు కూడా ఉందన్నారు.   తర్వాత దాడిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్​ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైబరాబాద్​సీపీ ఆఫీస్​కు వెళ్లారు.

రెండు కేసులు నమోదు

కౌశిక్​రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో పోలీసులు రెండు ఎఫ్ఐఆర్​లు నమోదు చేశారు. గచ్చిబౌలి ఎస్ఐ మహేశ్​కుమార్​గౌడ్​ఇచ్చిన ఫిర్యాదుతో.. కౌశిక్​రెడ్డి ఇంట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, మియాపూర్​కార్పొరేటర్​ఉప్పలపాటి శ్రీకాంత్ ​తో పాటు 30 మందిపై కేసు పెట్టినట్టు మాదాపూర్​ డీసీపీ వినీత్ తెలిపారు. బీఆర్ఎస్​లీడర్​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​తో కలిసి ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి గచ్చిబౌలిలోని మాదాపూర్​డీసీపీ వినీత్​కు కంప్లయింట్ ఇవ్వగా గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద మరో కేసు ఫైల్ చేశారు.

సైబరాబాద్ కమిషనరేట్​లో బీఆర్ఎస్​ హైడ్రామా.. 

అరికెపూడి గాంధీ, అతడి అనుచరులను అరెస్ట్​ చేయాలని సైబరాబాద్ సీపీకి కంప్లయింట్​ఇవ్వడానికి వెళ్లిన బీఆర్ఎస్​లీడర్లను లోపలికి అనుమతించకపోవడంతో కౌశిక్​రెడ్డి, హరీశ్​రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీపీ అవినాశ్ మహంతి అందుబాటులో లేకపోవడంతో జాయింట్​సీపీకి ఫిర్యాదు చేశారు. సీపీ వచ్చి న్యాయం చేసే వరకు ఎక్కడికి కదలబోమని కమిషనరేట్​ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి పోలీస్​అధికారికి వేలు చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్​రావు కలుగజేసుకొని సదరు అధికారికి వార్నింగ్ ఇచ్చాడు. ‘నీ పేరేంది. నాలుగేండ్ల తర్వాత మళ్లీ వస్తం.. అప్పుడు చూస్కుందాం’ అని హెచ్చరించారు. దీంతో తమ డ్యూటీ తాము చేస్తున్నామని సదరు పోలీస్ ఆఫీసర్​బదులిచ్చారు. తాము కేసులు నమోదు చేశామని చెప్పినా వినకుండా బీఆర్ఎస్ లీడర్లు ఆందోళన చేపట్టడంతో హరీశ్​రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి సిటీ శివారు పోలీసు స్టేషన్లకు తరలించారు.


కేశంపేట పీఎస్​ వద్ద బీఆర్ఎస్ ఆందోళన

షాద్ నగర్, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ లీడర్లు హరీశ్​రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్​రెడ్డి, గాయత్రి రవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిని పోలీసులు కేశంపట పీఎస్​కు తరలించగా మార్గమధ్యంలో బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకున్నారు. కొత్తూరు మండలంలోని ఇన్ముల్ నర్వ గ్రామంలో పోలీస్ వాహనాలకు అడ్డు రాగా పక్కకు తప్పించి వెళ్లిపోయారు. కొత్తపేటలోనూ అడ్డు రావడంతో స్వల్ప లాఠీ చార్జి చేసి కేశంపేట పీఎస్​కు తరలించారు. ఈ సందర్భంగా తమను ఇక్కడికి ఎందుకు పట్టుకువచ్చారో చెప్పాలంటూ  ఏసీపీ రంగస్వామితో హరీశ్​రావు వాగ్వాదానికి దిగారు. ‘10 వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి వస్తరు చూడు’ అని వార్నింగ్​ఇచ్చారు. ఈ క్రమంలో పీఎస్​బయట బీఆర్ఎస్​కార్యకర్తలు ఆందోళనకు దిగి నినాదాలు చేస్తుండడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి బీఆర్​ఎస్​ నేతలందరినీ పోలీసులు వదిలేశారు.

నన్ను మర్డర్​ చేసే ప్లాన్​తో వచ్చారు 

గాంధీ, అతడి అనుచరులు తన ఇంటిపై దాడి చేసేందుకు వస్తే ఎందుకు అడ్డుకోలేదని కౌశిక్​రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ బిడ్డలం, ఆంధ్రావాళ్లు దాడి చేస్తే ఊరుకుంటామా, తెలంగాణ పవరేంటో రేపు(సెప్టెంబర్​ 13)న చూపిస్తానని సవాల్​విసిరారు. చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని హెచ్చరించారు. తనను మర్డర్​చేయాలనే ప్లాన్​తోనే వచ్చారని ఆరోపించారు. బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.