ప్రతి చుక్కకీ లెక్కుండాలి : మందు షాపుల్లో లావాదేవీలపై నిఘా పెట్టాం

 ప్రతి చుక్కకీ లెక్కుండాలి : మందు షాపుల్లో లావాదేవీలపై నిఘా పెట్టాం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ లోని మద్యం దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి (డీఈవో), జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీ రోనాల్డ్‌ రోస్‌ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్‌ రూం నుంచి ఈ కెమెరాలను పర్యవేక్షిస్తామని డీఈవో తెలిపారు.

అక్టోబర్ 18న బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రాంతీయ రవాణా అథారిటీ (RTA), యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఆదాయపు పన్ను, విజిలెన్స్ విభాగాల ప్రతినిధులతో డీఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో భాగంగా పార్సెల్‌లు, కొరియర్‌ల విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

"హైదరాబాద్‌లో నగదు, మద్యం తరలింపును నిరోధించడానికి ఎన్నికల అధికారులు జిల్లా సరిహద్దుల్లో నిఘా కార్యకలాపాలను పెద్ద ఎత్తున నిర్వహించాలి" అని రోనాల్డ్ తెలిపారు. 18 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, గోడౌన్‌లలో ఎక్సైజ్ అధికారులచే చెకింగ్ లు నిర్వహిస్తామని, హాట్ స్పాట్‌లను గుర్తిస్తామని డీఈవో చెప్పారు. అన్ని గోడౌన్లను తనిఖీ చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.