- వచ్చే ఏడాది నుంచే కొత్త సిలబస్ అమల్లోకి..
- 2024లో మార్చినా.. లేటెస్ట్ టెక్నాలజీ కోసం మళ్లీ సవరణలు
- టాటా టెక్నాలజీస్ సాయంతో జాబ్ ఓరియెంటెడ్‌గా రూపకల్పన
హైదరాబాద్, వెలుగు: టెక్నికల్ ఎడ్యుకేషన్ లో వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల సిలబస్ మరోసారి మారుబోతున్నది. కేవలం సర్టిఫికెట్లు ఇచ్చే చదువులు కాకుండా.. డిప్లొమా పూర్తవ్వగానే జాబ్ కొట్టేలా సిలబస్ ను రూపొందించాలని డిసైడ్ అయ్యారు. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న మొత్తం 25 బ్రాంచుల్లోనూ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)’ అప్లికేషన్లను సిలబస్‌లో చేర్చనున్నారు.
సీఎస్ఈతో పాటు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్.. ఇలా బ్రాంచ్ ఏదైనా సరే, ప్రతి విద్యార్థికీ ఏఐపై పట్టు ఉండేలా, ఇండస్ట్రీలో దాని వినియోగం తెలిసేలా ఈ కొత్త కరిక్యులమ్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వాస్తవానికి 2024లోనే పాలిటెక్నిక్ సిలబస్‌లో మార్పులు చేసినా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మరోసారి అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు కొత్త సిలబస్ రూపకల్పన పూర్తి కానున్నది. 2026–27 అకడమిక్ ఇయర్ నుంచి ఫస్టియర్ విద్యార్థులకు ఇది వర్తింపజేయనున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగిలిన ఇయర్స్ వారికి అందుబాటులోకి రానున్నది.
కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో భారీ మార్పులు
టాటా టెక్నాలజీస్ సహకారంతో రూపొందిస్తున్న ఈ సిలబస్ పూర్తిగా ‘జాబ్ ఓరియెంటెడ్’గా ఉండనున్నది. కేవలం థియరీ కాకుండా.. పరిశ్రమలకు ఏం కావాలో అదే నేర్పించనున్నారు. ముఖ్యంగా ‘అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్’ విధానాలను సిలబస్‌లో ప్రధానంగా చేర్చుతున్నారు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో భారీ మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఏకంగా 30శాతం వరకూ మార్పులు జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.
మిగిలిన బ్రాంచుల్లో 10 నుంచి 20 శాతం వరకు సిలబస్‌ను మారుస్తున్నారు. పాతకాలపు పాఠాలను పక్కనపెట్టి, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు ఈ మార్పులు చేస్తున్నారు.
