ఆలు రైతు దిగాలు.. నార్త్ ఇండియా నుంచి ఆలుగడ్డల దిగుమతితో.. స్థానికంగా ధరలు పతనం

ఆలు రైతు దిగాలు.. నార్త్ ఇండియా నుంచి ఆలుగడ్డల దిగుమతితో.. స్థానికంగా ధరలు పతనం
  • 10 కిలోల బస్తా రూ.200 నుంచి రూ.100కు తగ్గుదల
  • రైతులకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి
  • ఇప్పటికే దిగుబడి తగ్గుదలతో బేజారు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: నార్త్​ ఇండియా నుంచి భారీగా ఆలుగడ్డలు దిగుమతి కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానికంగా ధరలు పడిపోయాయి. ఇప్పటికే వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి సరిగ్గా రాక ఆందోళన చెందుతున్న రైతులకు.. ధరల పతనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌‌లోని ఆగ్రా, మధ్య ప్రదేశ్‌‌లోని ఇండోర్, పంజాబ్ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 20 నుంచి 30 లారీల్లో ఆలుగడ్డలు హైదరాబాద్ మార్కెట్లకు చేరుతున్నాయి. పదిహేను రోజుల క్రితం 10 కిలోల బస్తా రూ.200 వరకు పలికిన ధర ప్రస్తుతం రూ.100కు పడిపోయింది. 

గత ఏడాది ఇదే సమయంలో రూ.220కు అమ్ముడైన బస్తా ఇప్పుడు సగానికి తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో కిలో ఆలుగడ్డ రూ.22కు అమ్ముతున్నప్పటికీ, రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి మెదక్​ జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగు జరుగుతుండగా, సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 3 వేల ఎకరాల్లో పంట ఉంది. గజ్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని ములుగు, వర్గల్, మర్కుక్, జగదేవ్‌‌పూర్, గజ్వేల్, రాయపోల్ మండలాలతో పాటు సిద్దిపేట డివిజన్‌‌లో పలు గ్రామాల్లో ఆలుగడ్డ సాగు చేస్తున్నారు.

దిగుబడి అంతంతే..

ఈ సీజన్ ప్రారంభంలోనే వాతావరణ మార్పుల ప్రభావంతో సుమారు 20 శాతం పంట దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. మొంథా తుఫాను కారణంగా కురిసిన అకాల వర్షాలు, అనంతరం తీవ్ర చలితో పంట తీవ్రంగా దెబ్బతిన్నది. అధిక వర్షాలతో గడ్డలు కుళ్లిపోవడం, మొలకలు రాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. కొందరు రైతులు పంటను పూర్తిగా తొలగించి మళ్లీ విత్తుకున్నారు. మొత్తం విత్తిన పంటలో 50 శాతం వరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈసారి 10 క్వింటాళ్లలోపే వస్తోందని రైతులు చెబుతున్నారు.

కూలి ఖర్చు లు కూడా రావట్లే..

ఒక ఎకరా సాగుకు సుమారు రూ.45 వేల వరకు రైతులు ఖర్చు చేశారు. ప్రస్తుతం 10 కిలోల బస్తా ధర రూ.80 నుంచి రూ.100 మధ్యే ఉండడంతో కూలి ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. స్థానిక రైతుల పంట మార్కెట్‌‌కు వచ్చే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులను నియంత్రించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన ఆలుగడ్డ రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. విత్తనాలపై రాయితీ లేకపోవడం, వాతావరణ ప్రభావంతో పంట నష్టం, ధరలు పడిపోవడం వంటి కారణాలతో భారీ నష్టం జరిగిందని వాపోతున్నారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం ప్రకటించాలని వేడుకుంటున్నారు.

క్షీణించిన కూరగాయల ధరలు..

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో కూరగాయల ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. స్థానికంగా రైతులు పండించిన కూరగాయలు భారీగా మార్కెట్‌‌కు చేరడంతో ధరలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో టమాట రూ.10కే విక్రయిస్తున్నారు. రెండు కిలోలు రూ.15కే అందిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో టమాట రూ.40కు పైగా ఉండగా, ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటల నుంచి కోసి మార్కెట్‌‌కు తరలించే ఖర్చు కూడా రాకపోవడంతో నష్టాలు తప్పడం లేదు. నెల క్రితం కిలో వంకాయ రూ.60 ఉండగా,  ప్రస్తుతం రూ.15కు పడిపోయింది. 

కాకరకాయ, దోసకాయ, బీరకాయలు గతంలో కిలో రూ.80 వరకు ఉండగా, ఇప్పుడు సగానికి తగ్గాయి. క్యాబేజీ రూ.60 నుంచి రూ.40కు చేరింది. సొరకాయ ఒక్కటి రూ.3 నుంచి రూ.4కే లభిస్తోంది. ఆలుగడ్డలు రూ.40 నుంచి రూ.20కు తగ్గాయి. కూరగాయలతో పాటు ఆకు కూరల ధరలు కూడా తగ్గాయి. కొత్తిమీర, మెంతికూర, పుదీనా పెద్ద కట్ట రూ.10కే అమ్ముతున్నారు. నెల క్రితం ఒక్కో కట్ట రూ.20 నుంచి రూ.30 వరకు విక్రయించారు.