V6 News

విద్యుత్ రంగం పవర్ఫుల్..జెన్కో పరిధిలో రూ.1.76 లక్షల కోట్లు,  రెడ్కో పరిధిలో రూ.1.24 లక్షల కోట్లకు ఒప్పందాలు

విద్యుత్ రంగం పవర్ఫుల్..జెన్కో పరిధిలో రూ.1.76 లక్షల కోట్లు,  రెడ్కో పరిధిలో రూ.1.24 లక్షల కోట్లకు ఒప్పందాలు
  • గ్లోబల్​ సమ్మిట్  వేదికగా ముందుకొచ్చిన 23 సంస్థలు
  •  1.50 లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు
  •  ఇది చరిత్ర: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమిట్ 2025’ ​వేదికగా పెట్టుబడుల సేకరణలో విద్యుత్ శాఖ రికార్డు సృష్టించింది. ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులతో మరే ఇతర శాఖకూ అందనంత ఎత్తులో నిలిచింది. రాష్ట్ర బడ్జెట్​కు సమాన విలువగల మొత్తానికి ఒకేసారి అగ్రిమెంట్లు చేసుకున్నది.

విద్యుత్​ శాఖలోని తెలంగాణ జెన్​కో, రెడ్​ కో సంస్థలలో గ్రీన్​ ఎనర్జీ తయారీ కోసం ఏకంగా 23 సంస్థలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం రూపొందించిన ‘తెలంగాణ విజన్ 2047’ కు తగ్గట్టు ప్రభుత్వంతో అగ్రిమెంట్లు చేసుకున్నాయి. అంతేకాకుండా రాష్ట్రానికి చెందిన సుమారు 1.50 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సంస్థలు హామీ ఇచ్చాయి.

2047 నాటికి రాష్ట్ర ప్రభుత్వం త్రీ ట్రిలియన్​ ఎకానమీ సాధించాలని లక్ష్యం పెట్టుకున్నది. ఇందులో భాగంగా అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలంటే ముందుగా కావాల్సింది విద్యుత్​. ఇప్పటికి రాష్ట్రంలో సగటున రోజుకు 15 వేల నుంచి 18 వేల మెగావాట్ల విద్యుత్​ వినియోగం జరుగుతోంది. 2047 నాటికి  ఇది 1.33 లక్షల మెగావాట్లకు చేరుకోనున్నది.

ఈ నేపథ్యంలో 2047 కల్లా 1.33 లక్షల మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో సంస్థ ఉన్నతాధికారులు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్​ ఉత్పత్తి రంగంలో దూసుకుపోతున్న ప్రైవేట్​ సంస్థలను ఈ సమిట్​కు అహ్వానించారు. ప్రభుత్వ లక్ష్యాలు ఏమిటో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యుత్​ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్​ మిట్టల్​ క్షుణ్ణంగా వివరించారు.

రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి 23 ప్రైవేట్​ సంస్థలు అంగీకారం తెలిపాయి. టీజీ జెన్​కో సంస్థ పరిధిలో 11 సంస్థలు రూ.1.76 లక్షల కోట్లు,  టీజీ రెడ్​కో సంస్థ ఆధ్వర్యంలో 12 సంస్థలు రూ.1.24 లక్షల కోట్లకు ఎంఓయూలపై సంతకాలు చేసి  ఒప్పందాలు చేసుకున్నాయి. 

మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది

తెలంగాణ రైజింగ్​ సమిట్​ 2025లో కేవలం విద్యుత్​ శాఖ పరిధిలోనే రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం ద్వారా మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇది ప్రారంభం మాత్రమే. ముందు ముందు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ స్థాయి సంస్థలు తెలంగాణ బాట పట్టనున్నాయి.

సీఎం రేవంత్​ రెడ్డి నాయకత్వంలో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించినం.   - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం