గుజరాత్ మోడల్ వద్దు..మన చరిత్రే స్ఫూర్తి  తెలంగాణ క్లైమెట్ కాన్‌‌క్లేవ్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి 

గుజరాత్ మోడల్ వద్దు..మన చరిత్రే స్ఫూర్తి  తెలంగాణ క్లైమెట్ కాన్‌‌క్లేవ్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి 
  •   రాబోయే 8 నెలలు వర్షాభావం.. కరోనా తరహాలో ఎల్‌‌నినోను ఎదుర్కోవాలి
  •     రైతులు ఒక పంట త్యాగం చేస్తే పశుపక్ష్యాదులకు నీటి భరోసా
  •     రెండేండ్లకు సరిపడా తిండి గింజలున్నాయి
  •     మూసీకి సొంత మోడల్..  అక్కడి పేదలకుఉచిత డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు
  •     డ్రగ్స్, కల్తీ, చెరువుల కబ్జాల కట్టడికి మూడు ప్రత్యేక సంస్థలు
  •     డీజిల్ ఆటోలు, ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్​ వెహికల్స్ తెస్తున్నం 


హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గుజరాత్ మోడల్‌‌ను కాపీ చేయాల్సిన అవసరం లేదని, మన చరిత్ర నుంచే స్ఫూర్తి పొందుతామని చెప్పారు. భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణవేత్తల సూచనలతో ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని, పెట్టుబడులతోపాటు ప్రకృతి పరిరక్షణకూ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్‌‌లో ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ‘తెలంగాణ క్లైమెట్ కాన్‌‌క్లేవ్–2026’ కర్టన్ రైజర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
 

తెలంగాణకు చెరువుల చరిత్ర ఉందని, కుంమ్రం భీమ్ ‘జల్, జమీన్, జంగల్’ కోసం పోరాడారని సీఎం గుర్తుచేశారు. కాకతీయుల కాలంలో రేచర్ల రుద్రదేవుడు, రాణి రుద్రమదేవి రామప్ప, పాకాల వంటి గొలుసుకట్టు చెరువులు నిర్మించారని చెప్పారు. హైదరాబాద్‌లో 1,300 చెరువులకుగాను 700 మాయమయ్యాయని, బతుకమ్మ కుంటలో 10 ఎకరాలు, తమ్మిడికుంటలో ఆక్రమణకు గురైన 16 ఎకరాలను హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుందని తెలిపారు. కబ్జాదారులు, కోర్టుల నుంచి అడ్డంకులు ఎదురైనా చెరువుల పరిరక్షణలో వెనక్కి తగ్గబోమన్నారు.

పేదలకు ఉచితంగా ఇండ్లు

మూసీ మురికికూపంలో బతుకుతున్న పేదలకు ఒక్క పైసా తీసుకోకుండా ఉచితంగా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించామని సీఎం తెలిపారు. పేదలకు అన్యాయం జరగకుండా లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. అభ్యంతరాలు, రాజకీయ నిరసనలున్నా మూసీ పునరుద్ధరణ పనులు ఆపబోమని, త్వరలోనే అందమైన మూసీని చూస్తారని అన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా డీజిల్ ఆటోలు, ఆర్టీసీ బస్సులను తొలగిస్తూ ఆటోలను, బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నామని వెల్లడించారు. డ్రగ్స్ నియంత్రణకు మూడు వేల మందితో ఈగల్ ఫోర్స్, ఆహార కల్తీ కట్టడికి టీజీ సేఫ్, చెరువుల రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేశామని, ఈ మూడు సంస్థలు దేశంలో మరెక్కడా లేవని చెప్పారు. తాను సీఎం కుర్చీలో ఉన్నంతకాలం తప్పు చేసినవారిని వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు.

మూసీకి సబర్మతి మోడల్ వద్దు: రాజేంద్ర సింగ్

హైదరాబాద్ మూసీ నదికి ‘సబర్మతి మోడల్’ సరిపోదని, నగరానికి సొంత మూసీ మోడల్ ఉండాలని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ సూచించారు. అత్యవసరమైన చోట మాత్రమే వాడుతూ సిమెంట్ కాంక్రీటైజేషన్‌ను తగ్గించి, కింది లేయర్​లో గడ్డి, ఆపై లేయర్​లో చెట్లతో సహజంగా నీటిని శుద్ధి చేయాలని చెప్పారు. నదిని నదిలాగే ఉంచాలని కాల్వగా, నాలాగా మార్చొద్దని, అవసరమైతే మూసీ పనుల్లో తాను వచ్చి సహకరిస్తానన్నారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువులను ప్రశంసిస్తూనే, ఇప్పటివరకు ఆరు చెరువుల పనులే పూర్తయ్యాయని, వేగం రెట్టింపు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రకృతి, సంస్కృతులను అనుసంధానిస్తూ వెంటనే ‘ఇంటిగ్రేటెడ్ జియో-కల్చరల్ మ్యాపింగ్’ చేయాలని, విధానపరమైన నిర్ణయం తీసుకొని అడవుల డీ-నోటిఫికేషన్‌ను అడ్డుకుని అడవులను, పర్వత శ్రేణులను కాపాడాలని కోరారు. 

సంక్రాంతి తర్వాత ప్రతినెలా రూ.2వేల కోట్ల పనులు: ఉత్తమ్

ఎల్‌నినో, కరువు ప్రభావ నివారణకు రూ.10 వేల కోట్లతో కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి తర్వాత ఐదు నెలలపాటు ప్రతినెలా రూ.2 వేల కోట్లతో పనులు చేపడతామన్నారు.  గ్రామాల్లో శాశ్వత ఆస్తులు ఏర్పడేలా ఐదంచెల వ్యహం అమలు చేస్తామన్నారు. చెరువులు, కాలువల పునరుద్ధరణ, వర్షపు నీటి నిల్వ, పొలం బాటలు, భూగర్భజలాల పెంపు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి ఇందులో ఉంటాయన్నారు. సౌర, పవన విద్యుత్, బ్యాటరీ స్టోరేజీ కలిపి 6 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ సామర్థ్యానికి టెండర్లు పిలిచామని వెల్లడించారు. 

కరువుపై ముందస్తు పోరు

రాబోయే 8 నెలలు వర్షాలు కురిసే అవకాశం లేదని, రెండేండ్లకు సరిపడా ఆహార ధాన్యాలున్నా నీటి కొరత ముప్పు ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. కరోనా ముప్పును ఎదుర్కొన్నట్టే రాజకీయాలకు అతీతంగా కరువు, ఎల్‌‌నినోను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పశుపక్ష్యాదులకు నీళ్లు ఉండేలా రైతులు ఒక పంటను త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశారు. క్లౌడ్‌‌బరస్ట్‌‌లతో రెండు గంటల్లో 24 నుంచి 40 సెం.మీ. వర్షం కురుస్తుండగా, నగరాల మౌలిక సదుపాయాలు రోజుకు 2 సెం.మీ. వర్షపాతానికే అనుగుణంగా ఉన్నాయని వివరించారు. చెరువులు, నాలాల ఆక్రమణలే వరద ముంపునకు కారణమన్నారు.