నిషేధంపై కన్నెర్ర చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు

నిషేధంపై కన్నెర్ర చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు
  • హెల్త్ డైరెక్టరేట్ వద్దకు క్యూకడుతున్న యాజమాన్యాలు
  • న్యాయపోరాటం చేస్తామంటూ అధికారులకు వార్నింగ్

హైదరాబాద్: కరోనా చికిత్స పేరుతో అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అధికారులపై కన్నెర్ర చేస్తున్నాయి. మీ చర్యలు మా రెప్యుటేషన్ ను దెబ్బతీస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని కోర్టుకీడ్చి మీ సంగతి తేలుస్తామంటూ వార్నింగులు ఇస్తున్న ఘటనలు హెల్త్ డైరెక్టరేట్ లో కనిపిస్తున్నాయి. కరోనా మార్గదర్శకాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల అమలు, ఫీజుల వసూలు తదితర అడ్డగోలు వ్యవహారాలపై బాధితుల ఫిర్యాదులతో అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం 64 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ
చేశారు.

విరించి హాస్పిటల్ లో జరిగిన గొడవ సంచలనం రేపిన నేపధ్యంలో బాధితుల ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సదరు ఆస్పత్రిలో కరోనా చికిత్సను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కరోనా బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు చేయడం పెరిగింది. ఫిర్యాదుల ఆధారంగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సరైన జవాబు రాని, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని ఆస్పత్రులపై నిషేధం వేటు వేయడం ప్రారంభించారు. విరించి ఆస్పత్రి తర్వాత మరో డజనుకుపైగా ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను నిషేధించడంతో కార్పొరేట్.. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలను ఆగ్రహానికి గురిచేసినట్లు తెలుస్తోంది. కోవిడ్ చికిత్సపై నిషేధం విధిస్తుండడంతో డిహెచ్ కార్యాలయానికి ప్రయివేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు క్యూ కడుతున్నాయి. 

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తో కలసి తమ వాదనలు వినిపిస్తుండగా.. కొంత మంది బెదిరింపు తరహాలో మాట్లాడుతున్నట్లు సమాచారం. కిమ్స్ భాస్కర్ రావు, సన్ షైన్ గురువా రెడ్డి, ఇతర కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతినిధులు తమ ఆసుపత్రుల కోవిడ్ లైసెన్స్ ను ఎందుకు రద్దు చేసారంటూ ఆరా తీశారు. కంప్లైంట్స్ వచ్చిన పేషంట్స్ బిల్ కాపీలను మరోసారి డిహెచ్ కు అందజేస్తున్నట్లు సమాచారం. మా ఆస్పత్రులన్నీ మంచి రెప్యుటేషన్ తో నడుపుకుంటున్నాం.. మా రెప్యుటేషన్ పోవాలని కోరుకోవడం లేదు.. వైద్య శాఖ నోటీసులు, కోవిడ్ లైసెన్స్ రద్దు అంశాలపై న్యాయ పోరాటం చేస్తాం..ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఫాలో అవుతున్నాం..మున్ముందు మూడవ వేవ్ వచ్చేఅవకాశం ఉన్న పరిస్థితులలో .. లైసెన్స్ రద్దు చేస్తే.. ప్రజలు ఇబ్బంది పడతారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. సన్ షైన్ హాస్పిటల్ చైర్మన్  గురువా రెడ్డి మాట్లాడుతూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ కు జరిగింది వివరించాము. పేషంట్ ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయ్యింది. సన్ షైన్ మీద ఒకే ఒక కంప్లైంట్ వచ్చింది.. ఇది కూడా రెప్యుటేషన్ కు సంబందించిన విషయం.. న్యాయ పోరాటం చేస్తానన్నారు.