ఫుల్ వానలు..ప్రాజెక్టులన్నీ నిండాయి..

ఫుల్ వానలు..ప్రాజెక్టులన్నీ నిండాయి..

భారీ వర్షాలకు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు జలసిరులను సంతరించుకున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. బీభత్సమైన వానలకు కొమురం భీం జిల్లాలోని ఆడ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243మీటర్లు కగా... ప్రస్తుతం 237 మీటర్ల వరకు నీరుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 850 క్యూసెక్కులు కాగా.. .ఔట్ ఫ్లో 4365 క్యూసెక్కులుగా ఉంది.

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 696 అడుగుల వరకు నీరుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టిఎంసీలు కాగా...ప్రస్తుత నీటి సామర్థ్యం 6.6 టిఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 13944 క్యూసెక్కులు...ఔట్ ఫ్లో 11055 క్యూసెక్కులుగా ఉంది. అటు స్వర్ణ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా...ప్రస్తుత నీటి మట్టం 1182అడుగుల వరకు నీరు చేరింది. ప్రాజెక్టులోకి 8700క్యూసెక్కుల వరద వస్తోంది.

కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్డు నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00  అడుగులు కాగా...ప్రస్తుతం 1404.50 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలుగా ఉండగా....ప్రస్తుత నీటి సామర్థ్యం 17.079 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో  29,800 క్యూసెక్కులుగా ఉండగా...4 గేట్ల ద్వారా 29,800 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి అధికారులు వదులుతున్నారు. 

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో శ్రీరాంప్రాజెక్టు పూర్తిగా నిండుకుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 114038  క్యూసెక్కులు కాగా..ఔట్ ఫ్లో -99940  క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా..ప్రస్తుతం 1091 అడుగులకు నీరు చేరింది. నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ...ప్రస్తుతం  90 టిఎంసీల నీరుంది.

కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్ లోకి భారీగా వరద నీరు వస్తోంది.  మోయతుమ్మెద వాగుతోపాటు మిడ్ మనేరు నుంచి లోయర్ మానేరులోకి వరద నీరు చేరుతోంది. దీంతో లోయర్ మానేరు డ్యాం నిండుకుండలను తలపిస్తోంది.  అధికారులు 6 గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటి మట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 916 అడుగులుగా ఉంది.  నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 20 టీఎంసీల నీరుంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా-- బోయినిపల్లి మండలంలోని  మిడ్ మానేరులోకి కూడా ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది.  ములవాగు, ఎగువ మానేరు వాగుల నుండి 30 వేల క్యూసెక్కులు, ఎస్సారెస్పీ నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు మిడ్ మానేరులోకి చేరుతోంది. దీంతో అధికారులు 6 గేట్లు ఎత్తి 32610 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీలోకి విడుదల చేశారు.  ప్రస్తుతం ప్రాజెక్టులో  27.5 టీఎంసీ లకు గాను 20.427 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లాలోని పార్వతీ బ్యారేజ్ లోకి భారీ గా చేరిన వరద నీరు వస్తోంది. పార్వతీ బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా...ప్రస్తుతం నీటి నిల్వ 5.92 టీఎంసీలుగా ఉంది. బ్యారేజ్ నీటి సామర్థ్యం 130 మీటర్లు కాగా...ప్రస్తుతం నీటి  సామర్థ్యం 127.50 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 210000  క్యూసెక్కులు... ఔట్ ఫ్లో 250000  క్యూసెక్కులుగా ఉంది.