వానలపై అలర్ట్.. కల్లాల్లో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశం

వానలపై అలర్ట్.. కల్లాల్లో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశం
  • లారీలను పెంచి ధాన్యం తరలింపు స్పీడప్ చేయండి
  • అవసరమైతే మరిన్ని గోదాములు అద్దెకు తీసుకోండి
  • రాజకీయ ప్రేరేపిత ఆందోళనల పట్ల కఠినంగా ఉండాలి
  • చివరి గింజ వరకూ కొంటాం.. రైతులు ఆందోళన చెందొద్దు
  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులపై అదనపు భారం లేకుండా ధరల నియంత్రణ కమిటీలు
  • జూన్ 3 నుంచి 20 వరకు  మూడో దశ రెవెన్యూ సదస్సులుంటాయని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: ఈ ఏడాది రుతుపవనాలు వారం పదిరోజుల ముందుగా వచ్చాయని, అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని కలెక్టర్లను  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముందస్తు వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లారీల సంఖ్యను పెంచి, మరిన్ని గోదాములను అద్దెకు తీసుకొనైనా ధాన్యం తరలింపు స్పీడప్​ చేయాలని సూచించారు.

తడిసిన వడ్లను కూడా కొంటామని, రైతులు ఆందోళన చెందొద్దని కోరారు. మంగళవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్  నుంచి  మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందస్తు వర్షాలపై సన్నద్ధత,  ధాన్యం సేకరణ,  వానాకాలం పంటల సాగు, సీజనల్​ వ్యాధులు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి తదితర అంశాలపై రివ్యూ చేశారు. ‘‘కలెక్టర్లు ప్రోయాక్టివ్​గా పనిచేయాలి..  మీరు క్షేత్రస్థాయికి వెళ్తేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది..’’ అని సీఎం స్పష్టం చేశారు.

ధాన్యం తరలింపు స్పీడప్​ చేయండి..
నిరుడితో పోలిస్తే 21.50 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని,  మరో నాలుగైదు లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలి ఉందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  ఆ ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేసి, తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘‘ధాన్యం సేకరణను స్పీడప్​చేయండి.  మరిన్ని లారీలను ఏర్పాటుచేసి తరలించండి. అవసరమైతే స్థానికంగా ఉన్న గోదాములను అద్దెకు తీసుకోండి. ఎక్కడైనా రైతులను  మిల్లర్లు, దళారులు  ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి’’ అని సూచించారు.

ఈ నెల 29, 30వ తేదీల్లో జిల్లాల ఇన్​చార్జి మంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటించాలని, ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని తెలిపారు. జూన్ 1 నాటికి జిల్లాలవారీగా ఈ అంశాలన్నింటితో పూర్తి నివేదికను తనకు అందించాలని, అదే రోజు సెక్రెటేరియెట్​లో మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పురోగతిపై సమీక్షిస్తానని చెప్పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. 

దేశంలోనే రాష్ట్రంలో అత్యధిక దిగుబడి
నిరుడు యాసంగిలో  42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటే, ఈసారి ఇప్పటికే 64.50 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని  సీఎం రేవంత్ వివరించారు. ఈ సీజన్​లో ధాన్యం కొనుగోలు చెల్లింపుల కింద రూ.12,184 కోట్లు చెల్లించామని చెప్పారు.   దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో ఈ ఏడాది 2.75 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించడం మన రైతులు సాధించిన విజయమని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లతోపాటు ఇతర  అంశాల్లో ప్రభుత్వంపై  విషం చిమ్మేందుకు కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు జరుగుతున్నాయని తెలిపారు. మనం చేసే  మంచి పనులు చెప్పుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తున్నదని చెప్పారు. ‘‘ఓచోట అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు లేట్​కావడం వల్లే  చనిపోయాడని దుష్ప్రచారం చేశారు’’ అని ఉదహరించారు. అందుకే కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల వివరాలను దాచిపెట్టకుండా వెల్లడించాలని, ఈ విషయంలో  ప్రోయాక్టివ్ గా పని చేయాలని ఆదేశించారు. 

కల్తీ విత్తనాలు, బ్లాక్​ మార్కెట్​పై కఠిన చర్యలు 
సీజన్ ముందుకు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో విత్తనాలు, ఎరువులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.  స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, బఫర్ స్టాక్ ఉందా? లేదా? చూసుకోవాలని సూచించారు.  ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. కల్తీ విత్తనాల నేర చరిత్ర ఉన్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని,  కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. జిల్లాలో  పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించుకోవాలని తెలిపారు.

మండలాల్లో ధరల నియంత్రణ కమిటీలు 
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల తుది జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్, ఎంపీడీవో, కార్మిక అధికారి, స్వయం సహాయక సంఘం సభ్యులతో ఈ కమిటీలుండాలని చెప్పారు. మేస్త్రీల చార్జీలు, స్టోన్ మెటల్ వంటి ధరలను కట్టడి చేసే బాధ్యతను ఈ కమిటీ చేపడుతుందని తెలిపారు.  లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లను సకాలంలో అందించాలని,  ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్ల తయారీకి ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు.  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్​ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క,  దామోదర రాజనర్సింహ,  తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,  సీఎస్​ రామకృష్ణారావు,  అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 

ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి
ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుందని, వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​ ఆదేశించారు.  ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, జిల్లాల్లో సీజన్​కు తగ్గట్టుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రమంతటా మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల ఇన్​చార్జి మంత్రులు రెవెన్యూ సదస్సుల నిర్వహణ షెడ్యూలు, ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా  అప్రమత్తంగా ఉండాలని  అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని  ఆదేశించారు.

రోడ్లపై నీరు నిల్వకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సూచించారు.  లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా  ప్రత్యామ్నాయ  చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రేటర్​ సిటీతోపాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు.