- ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన
- అయినా అది కొత్త ప్రాజెక్టే అంటూ ఆంధ్రా పాలకుల తిరకాసు
- 150 టీఎంసీల ప్రాజెక్టును 30 టీఎంసీలకు కుదించిన ఏపీ
- ఇప్పుడు ఆ 30 టీఎంసీలకూ కేటాయింపులు లేవని వాదనలు
- ఎస్ఆర్బీసీని చకచకా పూర్తి చేసుకున్న పొరుగు రాష్ట్రం
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపైనా ఏపీ కుట్రలు ఆపడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగించిన దోపిడీని కంటిన్యూ చేస్తోంది. ఒకప్పుడు 150 టీఎంసీలు తరలించేలా ప్రతిపాదించిన ఆ ప్రాజెక్టును.. ఇప్పుడు కనీసం 30 టీఎంసీలు తరలించుకునేందుకు కూడా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ కు అప్పటి పాలకులు డీపీఆర్ లాంటి ఒక నోట్ ను సమర్పించారు.
అందులో శ్రీశైలం బేస్ గా సొరంగాల ద్వారా 150 టీఎంసీల జలాలను తెలంగాణకు తరలించేలా ప్రతిపాదనలు పెట్టారు. కుడి గట్టున ఎస్ఆర్బీసీని నిర్మించుకునేందుకు కూడా ఒప్పందం చేసుకున్నారు. కానీ మన ప్రాజెక్టును అటకెక్కించిన పొరుగు రాష్ట్రం.. వాళ్ల వైపు వడివడిగా పనులు పూర్తిచేసుకున్నది. ఇప్పుడు అదే ప్రాజెక్టును మనం నిర్మిస్తుంటే పాత ప్రాజెక్టు కాదు.. కొత్త ప్రాజెక్టు అంటూ మోకాలడ్డుతోంది.
నీళ్లను మొత్తం కుదించి..
మనకు ప్రతిపాదించిన నీటి కోటాలో నాటి ఉమ్మడి పాలకులు భారీగా కోత పెట్టేశారు. 150 టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు కుదించారు. పోలవరం నుంచి 80 టీఎంసీలు డైవర్ట్ చేసుకునేందుకు అప్పటికే ఏపీకి అనుమతి ఉన్నది. దీంతో ఏపీ డైవర్ట్ చేస్తున్న దాంట్లో తెలంగాణకు వాటా ఇచ్చేలా శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు మాత్రమే ఎస్ఎల్బీసీకి కేటాయించారు.
తొలుత అక్కమ్మ బిలం వద్ద టన్నెల్ నిర్మాణానికి 1980లో నాటి సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారు. కానీ అది అడుగు కూడా ముందుకు పడలేదు. 1983 మేలో నాటి సీఎం ఎన్టీఆర్ ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీకి ఫౌండేషన్ వేశారు. సొరంగం లేట్ అవుతుందనే సిల్లీ కారణం చూపించి పుట్టంగండికి 1995లో లొకేషన్ మార్చారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను కాస్తా లిఫ్ట్ గా మార్చేశారు.
కానీ కుడి గట్టున మాత్రం ఎస్ఆర్బీసీ శరవేగంగా పూర్తయ్యింది. వాస్తవానికి ఎస్ఎల్బీసీ 150 టీఎంసీలతో పూర్తయ్యి ఉంటే ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలతోపాటు వరంగల్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకూ నీళ్లు అందించేందుకు వీలుండేది. కానీ మన ప్రాజెక్టును పండబెట్టిన గత పాలకులు.. వాళ్ల వైపు ప్రాజెక్టులను మాత్రం చకచకా పూర్తి చేసేసుకున్నారు.
ఇప్పుడూ అదే బుద్ధి..
పొరుగు రాష్ట్రం ఇప్పటికీ అదే బుద్ధిని చూపిస్తున్నది. ఎన్నో అడ్డంకుల తర్వాత మళ్లీ 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ 43.93 కిలోమీటర్ల సొరంగం, మూడు రిజర్వాయర్లతో ఎస్ఎల్బీసీకి శంకుస్థాపన చేశారు. కానీ, ఏపీ పాలకుల తీరుతో ప్రాజెక్టు పనులు 20 ఏండ్లు అయితున్నా పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన జరిగాక ఆ ప్రాజెక్టును కనీసం షెడ్యూల్ 11లోనూ చేర్చలేదు.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ ప్రాజెక్టును చేపట్టినప్పటికీ దాంట్లో చేర్చకపోవడంతో కొత్త ప్రాజెక్టు కిందనే పొరుగు రాష్ట్రం దానిని చేర్చింది. పైగా ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నది. అసలు ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే లేవని వాదనకు దిగింది. అప్పట్లో గోదావరి డైవర్షన్ నీటిని ఈ ప్రాజెక్టుకు ఇచ్చేలా జీవో ఇచ్చారని, ఇప్పుడు ఆ వాటర్ ను పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు చూపిస్తున్నారని పేర్కొంది.
కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు శ్రీశైలంలో కేటాయింపులు లేనట్టేనని ట్రిబ్యునల్ ముందు వాదనకు దిగింది. ఇప్పుడు ఇచ్చిన కొత్త జీవోలు చెల్లవంటూ మొండిగా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా ‘కేటాయింపులే లేనప్పుడు అది కొత్త ప్రాజెక్ట్ అని, అలాంటప్పుడు 30 టీఎంసీల తరలింపు అక్రమం అవుతుందని, మన నీళ్లకు గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నది.
242 మీటర్లు పూర్తి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. టన్నెల్ ప్రమాదం తర్వాత ఫిబ్రవరి 17న పనులు పునః ప్రారంభమయ్యాయి. మళ్లీ ప్రమాదాలు జరగకుండా అత్యంత జాగ్రత్తగా, సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటిదాకా అవుట్ లెట్ వద్ద 178 మీటర్లు, ఇన్ లెట్ నుంచి 64 మీటర్లు సహా.. మొత్తంగా 242 మీటర్ల మేర సొరంగం తవ్వారు. రోజుకు 14 మీటర్లు తవ్వేలా టార్గెట్ పెట్టుకున్నారు.
అందులో భాగంగా ప్రస్తుతం 9 మీటర్ల మార్క్ ను చేరుకున్నారు. సొరంగం తవ్వకం కోసం అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. ఎలక్ట్రిక్ లోడర్లు, ఎలక్ట్రిక్ డంపర్లు, ఎలక్ట్రిక్ లోకోలను తీసుకొస్తున్నారు. ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకుంటూ ప్రతి మీటర్ పనిని రికార్డ్ చేస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు వారాలకోసారి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.
