
- డీలర్లకు రూ.5 వేల వేతనం, రూ.300 కమిషన్ ఇవ్వాలి
- తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.140 ఇస్తున్న కమీషన్‌ను రూ.300కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఐదు నెలల కమీషన్ ను విడుదల చేయాలని కోరింది. రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించి మరిన్ని నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల రమేశ్‌బాబు, రెడ్డిమల్ల హనుమాన్ మాట్లాడుతూ.. రేషన్ సరుకుల హమాలీ చార్జీలను, షాపుల అద్దెను ప్రభుత్వమే భరించాలన్నారు. కరోనాతో మృతిచెందిన డీలర్ల కుటుంబాలకు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సాధిక్ పాషా, రాములు, బత్తుల మహేష్, శ్రీనివాస్, మోహన్, రమేశ్, యాదగిరి పాల్గొన్నారు.