- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆర్అండ్బీ మంత్రి వెంకట్రెడ్డి లేఖ
- విజయవాడ హైవేపై ట్రాఫిక్ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే వారికి ట్రాఫిక్ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్– విజయవాడ హైవేపై 9 రోజుల పాటు టోల్గేట్లు తెరిచి ఉంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని.. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో జనవరి 9 నుంచి 18 వరకు వాహనాల రాక పోకలు విపరీతంగా ఉంటాయని పేర్కొన్నారు.
పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న గతేడాది డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200 శాతం అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. అందువల్ల జనవరి 9 నుంచి 14 వరకుహైదరాబాద్ నుంచి విజయవాడ వైపు.. జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలకు టోల్ ఫ్రీ పర్మిషన్ఇవ్వాలని లేఖలో మంత్రి కోరారు. అలాగే, మంగళవారం సెక్రటేరియెట్లో ఆర్ అండ్ బీ శాఖ ఆఫీసర్లతో మంత్రి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ట్రాఫిక్ అంశంపై సీఎం రేవంత్రెడ్డి సీరియస్ గా ఉన్నారని.. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లెటర్రాశానని తెలిపారు.
అవసరమైతే ఒకటి, రెండు రోజుల్లో స్వయంగా వెళ్లి కలుస్తానని చెప్పారు. తప్పనిసరి ఐతే టోల్ ప్లాజాల వద్ద నామినల్ పేమెంట్ చేయడానికి ఆర్ అండ్ బీశాఖ సిద్ధంగా ఉందన్నారు. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరుతానన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, 108 అంబులెన్స్ లు, మెడికల్ టీం లు, రెవెన్యూ, పోలీసు, ఆర్ అండ్ బీ ఆఫీసర్లు అలెర్ట్ గా ఉండాలన్నారు.
ముందస్తు చర్యలు తీసుకోవాలి..
గత సంక్రాంతి పండుగ టైంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాల్లో వాహనాలు రద్దీ ఎక్కువ ఉంటుందని.. ఈ సారి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జాం కాకుండా చూసుకోవాలన్నారు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో రోడ్లను మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేపట్టవద్దన్నారు. రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలని మంత్రి ఆదేశించారు.
