మలేషియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి

మలేషియాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి
  • కుటుంబసభ్యులకు ఫోన్ చేయకుండా 5 నెలలుగా మిస్సింగ్‌‌‌‌ 
  • మృతుడిది జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామం

జగిత్యాల రూరల్, వెలుగు: ఉపాధి కోసం మలేషియాకు వెళ్లిన తెలంగాణ వాసి అనుమానాస్పదంగా చనిపోయాడు. జగిత్యాల రూరల్ మండలం హబ్సిపూర్ గ్రామానికి చెందిన కారం నర్సయ్య (45)కు భార్య అంజవ్వ, కూతుళ్లు దివ్య, దీపిక, సంధ్య ఉన్నారు. అతడు 23 ఏండ్ల కింద ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి దొరికిన పని చేస్తూ  కుటుంబానికి డబ్బులు పంపిస్తున్నాడు. ఏడాదిగా ఉపాధి లేక సరిగా డబ్బులు పంపించకపోవడంతో పాటు అతడు ఐదు నెలలుగా ఇంటికి కాల్ చేయడం లేదు. దీంతో నర్సయ్యతో కలిసి పని చేసే వ్యక్తులకు కాల్ చేసినా ఫలితం లేకపోయింది. అంజవ్వ తన ముగ్గురు కూతుళ్లతో కలిసి వెళ్లి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకుంది.

తెలంగాణ గల్ఫ్ బోర్డు మెంబర్ మంద భీమ్ రెడ్డికి మంగళవారం సమాచారం అందించాడు. మలేషియాలోని ప్రవాసి భారతీయులను సంప్రదించగా.. మూడు, నాలుగు రోజుల కింద నర్సయ్య మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు నర్సయ్య ఫొటోను కూడా పంపించారు. అయితే.. ఎలా  చనిపోయాడు.. పాస్ పోర్ట్ ఎక్కడ ఉందనే వివరాలు ఇండియన్ ఎంబసీ నుంచి సేకరిస్తున్నట్టు తెలిసింది. డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు ప్రవాసి భారతీయుడు గాజెంగి రంజిత్ ప్రయత్నాలు చేస్తున్నారు.