- ప్రతి నెలా టార్గెట్ కంటే రూ.2 వేల కోట్లు తక్కువ ఆదాయం
- కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖలో తగ్గిన ఇన్కమ్
- వరద నష్టం పనులకు నిధులెట్ల? అని ప్రభుత్వం తర్జనభర్జన
- వరద సాయంపై కేంద్రాన్ని మరోసారి కోరాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్‌కు ఆమ్దానీ తగ్గుతున్నది. ప్రతి నెలా అనుకున్న దానికంటే రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు తక్కువ వస్తున్నది. గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం రావడం లేదు. 2024–-25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి రూ.85,112 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.36 వేల కోట్లు మాత్రమే వచ్చింది. నిజానికి గత నెలఖారుకు లక్ష్యం ప్రకారం రూ.42,600 కోట్లు రావాల్సి ఉంది. అంటే ప్రతి నెల వెయ్యి కోట్లు తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలోనూ అదే పరిస్థితి ఉన్నది. నెలకు రూ.1,500 కోట్ల చొప్పున రూ.18 వేల కోట్లు రాబట్టుకోవాలని టార్గెట్ పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.7,500 కోట్లలోపే ఆదాయం వచ్చింది. అంటే నెలకు రూ.1,250 కోట్లు మాత్రమే వస్తున్నది.
ఇక ఎక్సైజ్ శాఖ రాబడి కూడా తగ్గింది. ప్రతి నెల సగటున రూ.3,500 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యం పెట్టుకోగా.. రూ.3 వేల కోట్లు కూడా దాటడం లేదు. ఓవైపు ఆదాయం తగ్గగా.. మరోవైపు ప్రతి నెల అప్పుల కిస్తీలు, వడ్డీలకు ప్రభుత్వం రూ.6 వేల కోట్లు చెల్లిస్తున్నది. ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఆర్బీఐ నుంచి ఎప్పుడూ తీసుకునే విధంగా యావరేజ్‌గా రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లు మాత్రమే తీసుకుంటున్నది.
వరద నష్టం పనులకు పైసలెట్ల?
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నష్టం అంచనా వేసి కేంద్రానికి రిపోర్టు పంపితే, అందులో పావు వంతు కూడా కేంద్రం సాయం చేయలేదు. దీంతో దెబ్బతిన్న రోడ్లను బాగు చేయడం, రైతులకు పంట నష్టపరిహారం చెల్లింపు, వరద బాధితులను ఆదుకోవడానికి నిధుల సమీకరణ ఎట్ల అనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. మరోవైపు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్కీములు అమలు చేయడం, ప్రతి నెల అప్పుల కిస్తీలు, వడ్డీలు చెల్లించడం సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో వరద నష్టంలో కనీసం 50 శాతమైనా ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని కోరాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో పాటు ఆదాయ మార్గాలను పెంచుకోవాలని, రెగ్యులర్‌గా ఇన్కమ్ తెచ్చిపెట్టే శాఖల అధికారులు మరింత ఫోకస్‌గా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం.
అరకొరగా కేంద్ర సాయం..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరద నష్టం సాయం రూ.416 కోట్లు.. దేనికీ సరిపోవని అధికారులు అంటున్నారు. ఇప్పుడున్న నిబంధనలు సరిగా లేవని, వాటిని మార్చి పరిహారం ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే, అది వేయడానికి రూ.లక్ష ఇవ్వాలి. అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయితేనే ఇస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల రిపేర్లకు కిలోమీటర్ కు రూ.60 వేలు ఇస్తున్నారు. కానీ నిజానికి ఇవి ఏమాత్రం సరిపోవు. కొన్ని లక్షల్లో ఖర్చు వస్తుంది.
రాష్ట్రంలో వరదల వల్ల రోడ్లు దెబ్బతిని రూ.7,693 కోట్లు నష్టం జరిగింది. పట్టణాల్లో రూ.1,216 కోట్ల నష్టం.. కల్వర్టులు, చెరువులకు గండ్లు పడి ఇరిగేషన్‌కు రూ.483 కోట్లు, మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలి రూ.331 కోట్లు, విద్యుత్ స్తంభాలు కూలి రూ.180 కోట్లు.. ఇలా వివిధ రకాలుగా మొత్తం రూ.10,312 కోట్ల నష్టం వాటిల్లింది. దీనిపై కేంద్రానికి రిపోర్టు ఇచ్చిన రాష్ట్రం.. తక్షణ సాయంగా రూ.2 వేల కోట్లు ఇవ్వాలని కోరింది. కానీ కేంద్రం అందులో పావు వంతు కూడా ఇవ్వలేదు. పైగా రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు ఎస్డీఆర్ఎఫ్ కింద ఇస్తున్నట్టు కేంద్రమంత్రి ప్రకటన చేశారు. ఇందులో నుంచి కనీసం వెయ్యి కోట్లు అయినా రాష్ట్రానికి వస్తాయనుకుంటే అదీ చేయలేదు.