గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2023: యువత మరణాల రేటు తగ్గకపోవడం కారణం ఇదే..

 గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2023: యువత మరణాల రేటు తగ్గకపోవడం కారణం ఇదే..

ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ది లాన్సెట్లో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) 2023 అధ్యయనం ప్రపంచ ఆరోగ్య ధోరణులపై ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. మొత్తం మరణాల రేటు గణనీయంగా తగ్గినా యువత మరణాలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం, అంటువ్యాధుల నుంచి దీర్ఘ కాలిక వ్యాధుల వైపు ఆరోగ్య సమస్యలు మళ్లుతుండటం ఈ నివేదికలోని ప్రధాన అంశాలు. 

1950లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 67 శాతం తగ్గింది. ఇది ప్రజారోగ్యం, వైద్య రంగంలో సాధించిన అద్భుతమైన పురోగతికి నిదర్శనం. మొత్తం మరణాలు తగ్గినా యువత మరణాల రేటు ఆ స్థాయిలో తగ్గడం లేదు.

ప్రధాన కారణాలు: ఆత్మహత్యలు, మాదకద్రవ్యాల వినియోగం, ఆల్కహాల్ వినియోగం. రోడ్డు ప్రమాదాలు. దేశాల వారీగా మరణాలు (2023 సంఖ్య) 1. చైనా 1.07 కోట్లు (అత్యధికం). 2. భారత్ దాదాపు కోటి. 3. అమెరికా 30 లక్షలు.

భారత ర్యాంక్: జనాభాను పరిగణనలోకి తీసుకుని లెక్కించిన మరణాల రేటులో భారత్ 73వ స్థానంలో ఉన్నది.

ప్రధాన ఆరోగ్య ప్రమాదాలు: ప్రపంచవ్యాప్తంగా మరణాలకు కారణమవుతున్న 88 ప్రధాన సమస్యల్లో మూడు అత్యంత కీలకమైనవిగా నివేదిక గుర్తించింది. అవి.. అధిక రక్తపోటు, వాయు కాలుష్యం, ఊబకాయం. 

వ్యాధుల నమూనాలో మార్పు: అంటువ్యాధుల ప్రభావం తగ్గుముఖం పట్టి, వాటి స్థానంలో అసంక్రమిత వ్యాధులు పెను సవాలుగా మారాయి. 

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్
ఇది ప్రపంచవ్యాప్తంగా మరణాలు, అనారోగ్యం, వైకల్యాలకుగల కారణాలను విశ్లేషించే ఒక సమగ్ర ప్రాంతీయ, ప్రపంచ పరిశోధన కార్యక్రమం. దీనిని ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేష నిర్వహిస్తుంది. ఇది డిసెబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్ (డీఏఎల్వై) అనే కొలమానాన్ని ఉపయోగిస్తుంది. డీఏఎల్వై అంటే ఒక అనారోగ్యం లేదా వైకల్యం కారణంగా కోల్పోయిన ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాల సంఖ్య. ప్రభుత్వాలు తమ ఆరోగ్య ప్రాధాన్యతలను నిర్దేశించుకోవడానికి ఈ డేటా అత్యంత కీలకం.