- తరుగు పేరుతో దోచుకుంటున్న మిల్లర్లు
- మంత్రి చెప్పినా సీజ్ చేయలే
ఖమ్మం/మహబూబ్‌నగర్ : వడ్ల రైతులను రైస్‌మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఐకేపీ సెంటర్లలో కాంటా పెడుతున్న వడ్లలో ఎలాంటి తరుగు తీయవద్దని, తీస్తే చర్యలు తప్పవని సివిల్‌సప్లయీస్ మంత్రి గంగుల కమలాకర్ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. ఏకంగా 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు కటింగ్ పెడ్తున్నారు. ఐకేపీ సెంటర్లో తప్ప తాలు కింద ప్రతి 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున కోత పెడ్తుంటే మిల్లులో మరోసారి 2 కిలోల చొప్పున కట్ చేస్తున్నారు. ఇందుకు ఒప్పుకోని రైతుల వడ్లను మిల్లుల్లో దింపుకోవడం లేదు. అక్రమాలను అడ్డుకోవాల్సిన నిర్వాహకులు, ఆఫీసర్లు మిల్లర్లకే సహకరిస్తుండడంతో రైతులు మునుగుతున్నారు.
వడ్లు దింపుకోని మిల్లులపై చర్యల్లేవ్..
ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కాంటా పెడ్తున్న వడ్లలో ఎలాంటి తరుగు తీయవద్దని, తీస్తే చర్యలు తప్పవని సివిల్ సప్లయీస్ మినిస్టర్ గంగుల కమలాకర్ పలుమార్లు మిల్లర్లను హెచ్చరించారు. తప్ప, తాలు పేరుతో ఎవరైనా కటింగ్ పెట్టినట్లు తెలిసినా, ఈ కారణంతో వడ్లను దింపుకోకపోయినా ఆ మిల్లులను సీజ్ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. కానీ మంత్రి మాటలను అటు మిల్లర్లు, ఇటు ఆఫీసర్లు ఖాతరు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐకేపీ సెంటర్లలో తప్ప తాలు కింద ప్రతి 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున ప్రతి క్వింటాల్‌కు 5 కిలోలు కోత పెడ్తున్నారు. తీరా మిల్లుకు పోయాక మరోసారి ప్రతి 40 కిలోల బస్తాపై 2 కిలోల కోతకు ఒప్పుకోవాలని, లేదంటే వడ్లు దింపుకోమని మిల్లర్లు బెదిరిస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా, పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నా ఆఫీసర్లు మాత్రం మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో నిన్న మొన్నటి వరకు కొన్ని రైస్‌మిల్లులకే పరిమితమైన దందా ఇప్పుడు దాదాపు అన్ని రైస్‌మిల్లులకు పాకింది. ఏ రైస్‌మిల్లు ముందు చూసినా పదులకొద్దీ అన్లోడ్ కాని వడ్ల లారీలు, ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. అధికారులు ఒత్తిడి తెస్తే మిల్లర్ల మనసు మారుతుందేమోనని ఒకటి, రెండు రోజులు చూస్తున్న రైతులు, లాభం లేకపోవడంతో మిల్లర్లు చెప్పినదానికి ఒప్పుకొని మునుగుతున్నారు.
సుతిలి ఖర్చు కూడా రైతులతోనే ..
మిల్లర్లు చేసే మోసం చాలదన్నట్లు ఐకేపీ సెంటర్లలో హమాలీల చార్జీలను, గోనె సంచులను కుట్టేందుకు వాడే సుతిలి ఖర్చును కూడా రైతులతోనే పెట్టిస్తున్నారు. నిజానికి హమాలీ చార్జీలను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. క్వింటాల్ వడ్లను సంచుల్లో ఎత్తితే రూ.5.65 ఇస్తోంది. కానీ ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే సాకుతో ఈ భారాన్ని రైతులపై మోపుతున్నారు. క్వింటాల్ వడ్లు ఎత్తితే హమాలీ కూలీ కింద రూ.40 కట్టించుకుంటున్నారు. బుధవారం నాటికి ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా రైతులు హమాలీ కూలి కింద రూ.2 కోట్ల74 లక్షల 31వేల600 చెల్లించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వడ్లను జోకినంక, వాటిని గోనె సంచుల్లో వేసి కుట్టేందుకు గతంలో సుతిలీని సెంటర్లే రైతులకు ఫ్రీగా సమకూర్చేవి. కానీ 2021 సంవత్సరంలో ఆయా జిల్లాల మార్కెటింగ్ శాఖలే సుతిలీ సప్లై చేయాలని ప్రభుత్వం సర్క్యూలర్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్ వడ్లకు రూ.1,960 ఎంఎస్పీ చెల్లిస్తుండగా, ఇందులో ఒక శాతం అమౌంట్ రూ.196ను మార్కెట్ ఫీజు కింద చెల్లిస్తోంది. ఈ డబ్బుల నుంచే మార్కెటింగ్ శాఖ సెంటర్లకు సుతిలీ, టార్పాలిన్లు, మాయిశ్చర్ మీటర్లు, వేయింగ్ మిషన్లు సప్లయ్ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి జిల్లాల సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు మార్కెటింగ్ ఆఫీసర్లకు లెటర్ కూడా పెట్టారు. కానీ, క్షేత్ర స్థాయిలో సెంటర్లకు సుతిలీ సప్లై చేయకపోవడంతో రైతుల ద్వారా కొనిపిస్తున్నారు.
మంత్రి చెప్పినా సీజ్ చేయలే
రెండు వారాల క్రితం సివిల్ సప్లయీస్ మంత్రి గంగుల కమలాకర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చారు. వైరాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న టైంలో రైతు సంఘం నేతలు కలిశారు. తరుగు పేరుతో మిల్లర్లు క్వింటాల్‌కు 10 కిలోల వరకు కోత పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే కొణిజర్ల మండలంలోని సదరు మిల్లును సీజ్ చేయాలని అక్కడే ఉన్న ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ ను మంత్రి ఆదేశించారు. ఇప్పటికే అక్కడ ఉన్న ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించాలని సూచించారు. అప్పుడు ఓకే చెప్పిన ఆఫీసర్లు, ఇప్పటి వరకు మిల్లును మాత్రం సీజ్ చేయలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక అధికార పార్టీ నేత ఒత్తిడి వల్లే ఆ మిల్లర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని నీరజలక్ష్మి మిల్లుకు రామడుగు మండలం దత్తోజిపేట కొనుగోలు కేంద్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం ఏడు ట్రాక్టర్లలో వడ్ల బస్తాలు తెచ్చారు. మూడు కిలోల చొప్పున కటింగ్‌కు ఒప్పుకుంటేనే దింపుకుంటామని లేదంటే వాపస్ తీసుకుపోవాలని మిల్లర్ చెప్పారు. సాయంత్రం మళ్లీ అడిగితే మీ వడ్లు మాకు అలాట్ కాలేదు, మేమ దించుకోం అని సమాధానమిచ్చారు. దీంతో ట్రాక్టర్లను అక్కడే వదిలి రైతులు వెళ్లిపోయారు. మిల్లర్ల తీరుపై సివిల్ సప్లయీస్ డీఎం, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆఫీసర్లు ఒత్తిడితో కేవలం రెండు ట్రాక్టర్ల వడ్లను మాత్రమే దింపుకున్నారు.
మంచిర్యాల జిల్లాలో 40 కిలోల బస్తాకు 3 నుంచి 4 కిలోలు కటింగ్ చేస్తున్నారు. కోతకు ఒప్పుకోకుంటే మిల్లర్లు వడ్లు దించుకోవడం లేదు. దీంతో ఆఫీసర్లు వడ్లను ప్రభుత్వ, ప్రైవేట్ గోడౌన్లకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు కొనుగోలు కేంద్రం నుంచి ఒక లోడ్ వడ్లు కొణిజర్లలోని రైస్ మిల్లుకు తరలించారు. క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తామన్నారు. అందుకు ఒప్పుకోకపోవడంతో లోడ్ తిప్పి పంపించారు. ఇదే జిల్లా గోకినేపల్లి సెంటర్లో 10 కిలోల వరకు తరుగు తీయడంతో ఆగ్రహించిన రైతులు ఖమ్మం, -కోదాడ హైవేపై ఇటీవల ఆందోళన చేశారు.
హమాలీ చార్జీలు మాతోనే పెట్టిస్తున్రు..
నాకున్న రెండు ఎకరాల్లో వరి వేసిన. 50 బస్తాల దిగుబడి వచ్చింది. వడ్లను సెంటర్‌కు తెచ్చి అమ్మిన. జోకినంక సుతిలీ ఇవ్వమంటే సెంటరోల్లు ఇయ్యలె. బయటి నుంచి కొని తెస్తే కుట్లు వేసిన్రు. బస్తాల్ల నింపినంక హమాలీ పైసలు అడిగిన్రు. క్వింటాలుకు రూ.40 చొప్పున హమాలీలకు కూలి కట్టిచ్చిన.
– బీరప్ప, రైతు, దేశాయిపల్లి, మహ్మదాబాద్ మండలం
