- 2047 నాటికి అత్యున్నత రాష్ట్రంగా చేసే ప్రణాళిక
- వచ్చే నెల 8, 9వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం
- బ్రాండింగ్ కోసం ప్రముఖులు, సెలబ్రిటీలు, క్రీడాకారులను రప్పించే యోచన
హైదరాబాద్, వెలుగు: అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యాచరణకు సిద్ధమవుతున్నది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రగతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు ‘‘తెలంగాణ రైజింగ్2047’’ పేరిట భారీ ఉత్సవాలను నిర్వహించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
వచ్చే నెల 8,9వ తేదీలలో ఈ అంతర్జాతీయ స్థాయి వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేండ్లు అవుతన్న సందర్భంగా దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా దార్శనిక ప్రణాళికను ఈ ఉత్సవాల వేదికగా రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో రాష్ట్ర ఇమేజ్ను ప్రపంచ వేదికపై మరింత పదిలం చేయాలని, భవిష్యత్తులో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కు వేదికగా మార్చాలని దృఢంగా సంకల్పించింది. ఈ వేడుకల కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రత్యేక వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసి, వేగంగా పనులను పర్యవేక్షిస్తోంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఈ కార్యక్రమానికి సమగ్ర సహకారం అందించాలని సీఎస్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రూపొందించిన సమగ్ర ప్రణాళికను ఈ ఉత్సవాల్లో ఆవిష్కరించనున్నారు.
బ్రాండ్ ఇమేజ్ను ఇనుమడింపజేసేలా
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ఇనుమడింపజేసేందుకు ఈ ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులను, అత్యున్నత సెలబ్రిటీలను, దిగ్గజ క్రీడాకారులను, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ముఖ్యంగా, ప్రపంచ ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రభావం చూపగల వ్యక్తులను ఈ వేడుకలకు రప్పించడం ద్వారా తెలంగాణ పేరును విశ్వవేదికపై మరింత ప్రచారం చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది.
వచ్చే 22 ఏండ్లలో తెలంగాణ ముఖచిత్రం ఇలా
రాష్ట్రానికి ముఖచిత్రంగా, గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం అభివృద్ధిపై ఈ వేడుకల్లో ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో చేపట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి, భవిష్యత్తులో రాబోయే అతిపెద్ద ప్రాజెక్టులను వివరంగా అంతర్జాతీయ అతిథులకు చూపాలని నిర్ణయం తీసుకున్నారు. ఫ్యూచర్ సిటీ ప్లాన్, రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ఆర్) నిర్మాణం, మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, వాటి వల్ల నగరం రూపురేఖలు ఎలా మారనున్నాయో విశదీకరించనున్నారు.
ఫ్యూచర్ సిటీలో వేడుకలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సంబంధించిన సన్నాహకాలపై సీఎస్ కె. రామకృష్ణ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచర్లలోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఇప్పటివరకు సాధించిన విజయాలను ప్రతిబింబించడంతో పాటు, రాబోయే మూడేళ్లు, ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యాచరణను కూడా ఈ సమ్మిట్ స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ శిఖరాగ్ర సమావేశానికి పరిశ్రమల ప్రముఖులు, ఐటీ నిపుణులు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు, క్రీడా, సినీ ప్రముఖులు సహా వివిధ రంగాల నుంచి 1,300 మందికి పైగా అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, నాస్కమ్, అసోచామ్ వంటి ప్రసిద్ధ వాణిజ్య, పరిశ్రమల సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల, ఆర్థిక సంస్థల సీఎండీలు కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు.
