V6 News

కలెక్టరేట్లలో కొలువుదీరిన తెలంగాణ తల్లి

కలెక్టరేట్లలో కొలువుదీరిన తెలంగాణ తల్లి
  • గ్లోబల్​ సమిట్​ నుంచి వర్చువల్​గా ఆవిష్కరించిన సీఎం
  • ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారు
  • డిసెంబర్ 9.. మనకు పండుగ రోజు: సీఎం రేవంత్​

హైదరాబాద్, వెలుగు:  ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని.. తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆమె గుర్తుంటారని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను గుర్తించి 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు. ఈరోజు మనకు పండుగ రోజు’’ అని పేర్కొన్నారు. 

మంగళవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్  వేదిక నుంచే ఆయన జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టిన రోజు అని, నాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును ప్రకటించింది కూడా ఇదే రోజు అని ఆయన గుర్తుచేశారు. అందుకే ఏటా డిసెంబర్ 9ని తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా, సోనియా గాంధీ పుట్టిన రోజుగా జరుపుకోవడం మనందరికీ సంతోష దాయకమని చెప్పారు. గతేడాది ఇదే రోజు సెక్రటేరియెట్​లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని  ఆవిష్కరించుకున్నామని ఆయన  పేర్కొన్నారు.