హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ దృక్పథం పౌల్ట్రీరంగ భవిష్యత్తుకు బలమైన దిక్సూచి అవుతుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని పీజేటీఎస్‌ఏయూలో జరిగిన ఇండియన్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ 40వ వార్షిక సదస్సును ఐకార్ డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్, ఇండియన్ పౌల్ట్రీ సైన్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించాయి.
ఈ సందర్భంగా బయాస్ మాట్లాడుతూ... తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించిన విధానాలను పౌల్ట్రీ రంగం అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆవిష్కరణలు, శాస్త్రీయ అనుసంధానం, విద్యాసంస్థలు ,పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలను పెంపొందిస్తేనే పౌల్ట్రీ రంగం ముందుకు సాగుతుందని బయాస్ చెప్పారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 400 మందికి పైగా శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.

