
హైదరాబాద్: దేశానికి తెలంగాణ ఐకానిక్‌గా మారిందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. వేరే రాష్ట్రాల మంత్రులు మనల్ని చూసి నేర్చుకుంటున్నారని చెప్పారు. ‘బడ్జెట్‌లో 14 శాతం విద్యారంగం మీద ఖర్చు చేశాం. గురుకులాలతో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. 15.32 లక్షల మంది విద్యార్థులకు ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తున్నాం. ఆరు దశాబ్దాల్లో వేసిన రోడ్ల కంటే ఈ ఆరేండ్లలో ఎక్కువ రోడ్లు వేశాం. వ్యవసాయం మీద జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ ఖర్చు పెడుతోంది. ఇది 11.3 శాతంగా ఉంది. యాసంగిలో వ్యవసాయంలో తెలంగాణ నంబర్ వన్‌లో ఉంది. పత్తిసాగులో రెండో స్థానంలో ఉన్నాం. విద్యుత్ రంగంలో జాతీయ సగటు కంటే ఎక్కువ శాతం ఖర్చు చేస్తున్నాం. ప్రతి పల్లెలో 24 గంటలు అందిస్తున్నాం. దీన్ని ప్రతిపక్షాలు గుర్తించాలి’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.