
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారుల ఐక్య వేదిక
ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ మలి దశ ఉద్యమంలో పోరాడిన ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను గుర్తించి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారుల ఐక్యవేదిక కోరింది. 2017, 2021 పీఆర్సీ అమలు చేసి యూనియన్లను అనుమతించాలని పేర్కొంది. గురువారం బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార కేంద్ర కార్యాలయంలో పాశం యాదగిరి అధ్యక్షతన తెలంగాణ ఆర్టీసీ ఉద్యమకారుల ఐక్యవేదిక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సమావేశం అనంతరం పలు తీర్మానాలు చేసి 13 మందితో అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ గా కుమారస్వామి, వైస్ చైర్మన్ జి. హేమలత, కన్వీనర్లుగా వి. లాలయ్య, ఏ. జయ, ప్రచార కార్యదర్శి ఎమ్మెస్ రావు, కో కన్వీనర్ ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆర్టీసీ తెలంగాణ ఉద్యమకారులు స్వాగతిస్తున్నారని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో దొంత ఆనందంతో పాటు ఆర్టీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు.