
- పర్యాయ పదాలతో సమగ్ర సంకలనం
- రూపకల్పనలో సాహిత్య అకాడమీ నిమగ్నం
- ఒకటి, మూడో శనివారాలు సాహిత్య వారం
- విద్యార్థులకు రచనలపై శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం
- తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భాష, సంస్కృతి, సాహిత్యం వైభవాన్ని నలుదిశలా చాటిచెప్పేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భాషలోని పర్యాయ, ప్రాచీన పదాలు, ఆధునిక, వాడుక పదాలతో కూడిన ‘తెలంగాణ పదకోశం’ సంకలనాన్ని రూపొందిస్తున్నది. ఈ మేరకు పదాల సేకరణలో సాహిత్య అకాడమీ నిమగ్నమైంది. రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ తెలంగాణలో వాడుక భాష, యాస, మాండలికల్లో తేడాలు ఉంటాయి. ఉమ్మడి 10 జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడుతారు. తెలంగాణవ్యాప్తంగా మాట్లాడే వాడుక పదాలు, మాండలికాలను ఒకచోట చేర్చేలా ‘తెలంగాణ పదకోశం’ రూపుదిద్దుకోబోతున్నది. తెలంగాణ తెలుగులో ఉన్న వేలాది తేట తెనుగు పదాలతో పదకోశం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో కనుమరుగైన, కాలగర్భంలో కలిసిపోయిన పదాలను వెతికి ఒకచోట చేర్చనున్నారు. తెలంగాణ పలుకుబడులు కుప్పులు తెప్పలుగా ఉన్నాయి. ఇన్నాండ్లు పాఠ్య పుస్తకాల్లో మనం మాట్లాడే భాషకు స్థానం లేదు. నిత్యజీవితంలో వాడే పదాలు కూడా పుస్తకాలు, పత్రికల్లో రాలేదు. విస్మరణకు గురైన వేల పదాలు ఇందులో అనేకం ఉన్నాయి. గతంలో వ్యక్తిగత స్థాయిలో కొంతమంది తెలంగాణ పదాలను ఏర్చికూర్చి పుస్తకాలుగా వెలువరించారు. అవి పూర్తిస్థాయిలో తెలంగాణ పదాలకు సరిపోలేదనే భావన సాహితీవేత్తల్లో ఉన్నది. దీంతో గ్రామాలతో పాటు ప్రాచీన సాహిత్య గ్రంథాల నుంచి పదాల సేకరించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సాహితీవేత్తలతో తెలంగాణపదాలు, మాండలికంపై శాస్త్రీయ పద్ధతులతో పద సేకరణ, వర్గీకరణ, పరిశోధనలు చేసి ‘తెలంగాణ పదకోశానికి ఓ రూపు తీసుకురావాలని భావిస్తున్నారు. తెలంగాణవాడుక భాషలోని పదాలకు పర్యాయపదాలను సైతం పదకోశంలో పొందుపర్చనున్నారు.
‘సాహిత్య వారం’గా ఒకటి, మూడో శనివారాలు
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ప్రతినెలా ఒకటి, మూడో శనివారాలను ‘సాహిత్య వారం’గా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కవులు, సాహితీవేత్తలు, రచయితలు తమ నవలలు, కథలు, కవితలు, ఇతర పుస్తకావిష్కరణలు చేస్తున్నారు. సాహితీవేత్తలతో చర్చా గోష్టి నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాహిత్యంలోని వివిధ అంశాలపై లోతైన చర్చలు జరుపుతున్నారు. అన్ని పాఠశాలల్లో ఆగస్టు 15, జనవరి 26తో పాటు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో విద్యార్థులకు భాషా నైపుణ్యం, సాహిత్య రచన, కవిత్వం, కథల రచన, సాహిత్య విమర్శవంటి అంశాలపై విద్యార్థులకు, యువతకు పోటీలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే ఈ అంశాలపై శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువతను సాహిత్యం వైపు ఆకర్షించేందుకు ఇలాంటి కార్యక్రమాల నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. సాహిత్య అకాడమీ ‘తెలంగాణ గ్రంథ సూచి’ పేరుతో ప్రణాళికలను రూపొందిస్తున్నది. తెలంగాణ సాహిత్యంలోని ప్రముఖ రచనలను ఒక సమగ్ర గ్రంథ సూచిగా తయారు చేసి, దాన్ని డిజిటల్, ముద్రణ రూపాల్లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
రాష్ట్ర ప్రభుత్వం సాహిత్యంపై దృష్టిసారించింది. రాబోయే తరాలకు తెలంగాణ సాహిత్య వైభవం చాటాలని.. అందుకోసం కవులు, రచయితలు వివరాలను సేకరిస్తున్నారు. వారు చేసిన సాహిత్య కృషిని ‘తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి’ పేరుతో ఒక ప్రత్యేక పేజీ ప్రింట్ చేస్తున్నారు. గత వైభవాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలను ప్రభుత్వం ఇప్పటికే ముమ్మరం చేసింది. ప్రతి 3 నెలలకోసారి ‘పునాస’ పుస్తకాన్ని తీసుకొస్తున్నామని, త్వరలోనే మరిన్ని కార్యక్రమాలను శ్రీకారం చుట్టబోతున్నట్లు సాహిత్య అకాడమీ సెక్రటరీ బాలాచారి తెలిపారు.