కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా..19 మంది మృతి

కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా..19 మంది మృతి
  • ఈ ఏడాది ఇప్పటివరకు 69 మందికి అరుదైన వ్యాధి 
  • చెరువులు, కుంటల్లో స్నానం చేస్తే ముక్కు ద్వారా ఇన్ఫెక్షన్
  • 2016లో ఫస్ట్ కేసు.. ఈ ఏడాది భారీగా పెరిగిన కేసులు

తిరువనంతపురం:  కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కలకలం సృష్టిస్తోంది. మంచినీటి కుంటలు, చెరువుల్లో స్నానం చేసేవాళ్లకు వ్యాపిస్తున్న ఈ అరుదైన వ్యాధిని తొలిదశలో గుర్తించకపోతే ప్రాణాలను హరిస్తుండటం ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది ఇప్పటివరకు 69 మందికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా(నేగ్లేరియా ఫొలేరీ) సోకగా, వీరిలో 19 మంది మృతిచెందారు. ఇందులో ఎక్కువ మరణాలు గత కొన్నివారాల్లోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ తాజాగా ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ జాగ్రత్తలను సూచిస్తూ ఒక డాక్యుమెంట్​ను విడుదల చేసింది. 

అరుదైన ఈ అమీబా మనిషి ముక్కు ద్వారా మెదడుకు వేగంగా చేరుతుందని, తర్వాత బ్రెయిన్ టిష్యూను ఇది నాశనం చేయడం వల్ల తీవ్రమైన మెదడువాపుతో పేషెంట్ మరణానికి దారి తీస్తుందని పేర్కొంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో వచ్చే వ్యాధిని ‘ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్ సెఫలైటిస్ (పీఏఎం)’గా పేర్కొంటారని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ అమీబా వ్యాప్తిని గుర్తించామని తెలిపింది. ప్రజలు క్లోరినేషన్ చేయని, వెచ్చగా ఉండే మంచినీటి కుంటలు, చెరువులు, బావుల్లో స్నానం చేయొద్దని హెచ్చరించింది. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ ఇది వ్యాపిస్తుందని పేర్కొంది.  కాగా, కేరళలో పీఏఎం కేసు తొలిసారిగా 2016లో నమోదైంది. అప్పటినుంచి 2023 వరకూ కేవలం 8 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. కానీ 2024లో ఏకంగా 36 కేసులు, 9 మరణాలు సంభవించాయి. ఈ ఏడాది ఇప్పటికే 69 కేసులు నమోదు కాగా, 19 మంది మృతిచెందారు. 

ఎలా వ్యాపిస్తుంది?

మంచినీటి కుంటల్లో ఉండే నేగ్లేరియా అమీబా మనుషుల ముక్కు ద్వారా మాత్రమే మెదడుకు చేరుతుంది. వాసన గ్రహించేందుకు ఉపయోగపడే ఆల్ఫాక్టరీ మ్యూకోసా భాగం నుంచి క్రిబ్రిఫోర్మ్ ప్లేట్ ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. తర్వాత వేగంగా బ్రెయిన్ టిష్యూను నాశనం చేస్తుంది. దీంతో మెదడు తీవ్రంగా వాచిపోయి ‘సెరెబ్రల్ ఎడెమా’గా మారి మరణానికి దారి తీస్తుంది. కుంటల్లో ఈతకొట్టే వాళ్లకు, స్నానం చేసేవాళ్లకు ఇది వ్యాపించే ప్రమాదం ఎక్కువ. 

లక్షణాలు ఎలా ఉంటాయి? 

ప్రైమరీ అమీబిక్ మెనింజోఎన్ సెఫలైటిస్ వ్యాధి సోకినవారిలో తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని బ్యాక్టీరియల్ మెనింజైటిస్​గా పొరపడుతూ ఉండటం వల్ల పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. ఇది సోకిన ఒకటి నుంచి 9 రోజుల మధ్య సింప్టమ్స్ కనిపిస్తాయి. కొన్ని గంటలు మొదలుకొని 1 నుంచి 2 రోజుల వరకూ ఇది ఎప్పుడైనా తీవ్రంగా మారొచ్చు. రోగనిరోధక వ్యవస్థ స్పందించేలోపే మెదడుకు చేరుతుంది. 

చికిత్స ఎలా? 

ప్రీసెరెబ్రల్ స్టేజ్​లోనే(మెదడుకు చేరకముందే) గుర్తిస్తే తప్ప పేషెంట్​ను కాపాడలేరు. లక్షణాలు కనిపించగానే, వ్యాధి నిర్ధారణ, చికిత్సలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పేషెంట్ ప్రాణాలు పోవచ్చు.