హైదరాబాద్, వెలుగు: అంబేద్కర్ విదేశీ విద్య నిధి కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం మంజూరు చేయాలని అసెంబ్లీ, మండలి ఎస్సీ సంక్షేమ కమిటీ తీర్మానించింది. కమిటీ చైర్మన్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షతన శుక్రవారం శాసన మండలి కమిటీ హాల్ లో జరిగిన అసెంబ్లీ, మండలి ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశంలో తీర్మానం చేసింది.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు నాగరాజు, వెడ్మ బొజ్జు, మందుల సామెల్, విజుయుడు, కవ్వంపల్లి సత్యనారాయణ, గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య తోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య నిధి కోసం ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారితోపాటు గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ నిధి నుంచి ఉపకార వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులను వెంటన భర్తీ చేయాలని తీర్మానం చేసింది.
