V6 News

వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల పర్యవేక్షణ : కమిషనర్ రాణి కుముదిని

వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ స్టేషన్ల పర్యవేక్షణ : కమిషనర్ రాణి కుముదిని
  •     పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు: రాణి కుముదిని   
  •     ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన 

హైదరాబాద్, వెలుగు:  తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లి ఓటు వేయొచ్చన్నారు. శాంతి భద్రతలు, బందోబస్తు అంశాన్ని పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 

బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని ఎస్ఈసీ ఆఫీసులో పంచాయతీ ఎన్నికల అథారిటీ, పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన, రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ మంద మకరందు, అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్​తో కలిసి రాణికుముదిని మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్‌‌‌‌, వార్డు స్థానాల్లో ఏకగ్రీవాలకు సంబంధించి అభ్యర్థుల డిక్లరేషన్ల ఆధారంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎలా? సింగిల్‌‌‌‌ నామినేషన్‌‌‌‌ వస్తే ఏం చేయాలి? వంటి అంశాలు కోర్టులో ఉన్నాయని, వీటిపై వచ్చే తీర్పు లేదా ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామన్నారు. 

కోడ్‌‌‌‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలను మూసేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవిత చేసిన ఫిర్యాదును ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) కమిటీకి పంపించినట్టు ఆమె వెల్లడించారు. కోడ్ అమలుపై పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సీఎస్‌‌‌‌, జిల్లా స్థాయిలో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు పని చేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్‌‌‌‌ కీ బాత్‌‌‌‌’ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లోనూ రేడియోలో ప్రసారం అవుతున్నందున ఆకాశవాణి అధికారులు అనుమతి కోరారని చెప్పారు. 

పోలింగ్‌‌‌‌ రోజు ఓటింగ్‌‌‌‌ తీరు పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వెబ్‌‌‌‌ కాస్టింగ్‌‌‌‌ విధానాన్ని ఏర్పాటు చేశామన్నారు. మహేశ్‌‌‌‌ భగవత్‌‌‌‌ మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో చెక్‌‌‌‌ పోస్టులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. లోకల్‌‌‌‌ పోలీసులతోపాటు బయటి నుంచి ఫోర్స్​‍ను కూడా ఎన్నికల కోసం తీసుకున్నామన్నారు. 50 వేల మంది సివిల్‌‌‌‌ పోలీసులు బందోబస్తులో ఉంటారని తెలిపారు.