
- కేంద్రం నుంచి పర్మిషన్ రాగానే ఎయిర్‌పోర్ట్ సేవలు
- భద్రకాళి చెరువు కబ్జాదారులపై కఠినచర్యలు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కాశీబుగ్గ, వెలుగు : వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వరంగల్‌లోని భద్రకాళి బండ్, బొంది వాగు పనులు, భద్రకాళి ఆలయ మాడ వీధులను మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్యతో పరిశీలించారు. బొంది వాగు నాలా, భద్రకాళి నాలా, భద్రకాళి క్యాచ్‌మెంట్ ఏరియాల్లో వరద నివారణకు చేపట్టనున్న అభివృద్ధి పనుల మ్యాప్‌ను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆగమ శాస్త్రం ప్రకారం భద్రకాళి ఆలయాన్ని, మాఢవీధులను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆలయాన్ని అనుకొని ఉన్న చెరువులో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని, పూడికతీతకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. భద్రకాళి చెరువును కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సర్వే చేయించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామన్నారు. వరంగల్ నగరంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి రెండో రాజధానిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వరంగల్‌లో ఎయిర్‌పోర్టు సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఓఆర్‌ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు రాబోయే 30 ఏండ్ల వరకు వరంగల నగర ప్రజలకు అవసరమైన వసతులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు చెప్పారు. నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, కుడా పీవో అజిత్‌రెడ్డి, జీడబ్ల్యూఎంసీ ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు భీం రావు, సంతోష్‌బాబు, సీతారాం పాల్గొన్నారు. అంతకుముందు భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.