- సచివాలయంలోకి అనుమతించేందుకు పకడ్బందీ నిఘా
- లోపల గంట మాత్రమే ఉండాలి.. టైమ్దాటితే భద్రతా సిబ్బందికి అలర్ట్
- ప్రతి విజిటర్ కదలికపై డిజిటల్ మ్యాపింగ్
- ఏ పేషీకి వెళ్లారు.. ఎంత సేపు ఉన్నారనే వివరాలు స్కాన్ చేయనున్న సెక్యూరిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియెట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే అనధికారిక వ్యక్తుల కదలికలకు చెక్ పెట్టేందుకు సరికొత్త క్యూఆర్ కోడ్ ఎంట్రీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల కాలంలో కొందరు అపరిచిత వ్యక్తులు సచివాలయంలోకి చొరబడుతుండడంతో ఈ కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడే ముఠాలు ఎక్కువయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగులమని చెప్పుకుంటూ నకిలీ గుర్తింపు కార్డులతో సెక్రటేరియెట్‌లోకి వచ్చిన ఉదంతాలు వెలుగుచూశాయి. ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతుండడంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి అప్రమత్తమయ్యారు. భద్రతా లోపాలను అరికట్టేందుకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం సరికొత్త డిజిటల్ ఎంట్రీ విధానాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయనుంది. పైలట్ గా రెండు రోజుల నుంచి అమలు చేస్తున్నారు.
ఆయా పేషీలే ఎంట్రీ ఇచ్చేలా విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్
సందర్శకుల భద్రతా పర్యవేక్షణ కోసం సరికొత్త ‘విజిటర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ సాఫ్ట్‌వేర్‌ను అధికారికంగా రూపొందించారు. సెక్రటేరియెట్ లోపలికి విజిటర్స్ సాధారణంగా అనుమతించే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సమయంలో ఆన్ లైన్లో వివరాలు ఎంట్రీ చేసి ఫోన్‌కు క్యూఆర్ కోడ్ లింక్‌ను పంపి లోపలికి అనుమతిస్తారు. ఇలా కాకుండా మిగతా సమయాల్లో రావాలనుకుంటే కఠిన నిబంధనలు వర్తిస్తాయి. అలాంటి వారు సచివాలయంలో ఏ పేషీకి, ఏ అధికారి దగ్గరకు వెళ్తున్నారో ఆయా కార్యాలయాల నుంచే ఆన్‌లైన్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది.
సంబంధిత పేషీ అధికారులు ఆన్‌లైన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతే సదరు సందర్శకుడి మొబైల్‌కు క్యూఆర్ కోడ్ లింక్ మెసేజ్ రూపంలో వెళ్తుంది. ఆ తర్వాత సచివాలయం గేటు వద్ద ఉండే సెక్యూరిటీ సిబ్బందికి ఆ క్యూఆర్ కోడ్‌ను చూపిస్తే వారు దానిని స్కాన్ చేస్తారు. ఈ విధంగా సందర్శకుడి పూర్తి వివరాలను డిజిటల్‌గా ధ్రువీకరించుకున్న తర్వాతే లోపలికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతిస్తారు. ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ ఆధారంగా సందర్శకులు ఎవరి అనుమతితో లోపలికి వెళ్లారనేది, ఏ ఫ్లోర్‌లోని ఏ రూమ్ నంబర్‌కు వెళ్లారనే అంశం స్పష్టంగా రికార్డు అవుతుంది.
ఎక్కువ సేపు ఉంటే ఆరా తీసి బయటకు పంపిస్తరు
కొత్త నిబంధనల ప్రకారం సచివాలయంలో సందర్శకులు గంట కంటే ఎక్కువ సమయం ఉండటానికి వీల్లేదు. లోపలికి వెళ్లిన సమయం నుంచి కేవలం ఒక్క గంట మాత్రమే గడువు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. సందర్శకులు ఎంత సమయం లోపల గడిపారనేది కంప్యూటర్ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు అటోమేటిక్‌గా కౌంట్ అవుతుంది. సమయం ముగిసిన వెంటనే సందర్శకుడికి సంబంధించిన హెచ్చరిక సందేశం భద్రతా సిబ్బందికి చేరిపోతుంది. దీనివల్ల అనవసరంగా సెక్రటేరియెట్ లోపల కాలక్షేపం చేసే దళారులకు పూర్తిగా అడ్డుకట్ట పడనుంది.
నిర్ణీత గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరైనా లోపల ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. నకిలీ ఐడీ కార్డులతో తిరిగే మోసగాళ్లను పట్టుకోవడానికి ఈ విధానం ఎంతో తోడ్పడుతుందని భావిస్తున్నారు. సచివాలయ భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకే ఈ డిజిటల్ పద్ధతిని తెచ్చినట్లు తెలుస్తున్నది. ఈ సరికొత్త క్యూఆర్ కోడ్ ఆధారిత నిబంధనలు త్వరలోనే పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నాయి.
