- మరో రూ.40వేల కోట్ల రుణాలకు అనుమతివ్వండి
- మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీకి చేయూతనివ్వాలి
- ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టుల విస్తరణ దృష్ట్యా ఈసారి బడ్జెట్‌లో తెలంగాణకు పెద్దపీట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి మౌలిక వసతులు, మూలధనం వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండిచర్) కోసం సుమారు రూ.40 వేల కోట్ల రుణాలు సేకరించుకునేందుకు సహకరించాలని కోరింది. అలాగే, రాష్ట్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌ల కింద మరో రూ.40 వేల కోట్ల నిధులను నేరుగా బడ్జెట్‌లో కేటాయించాలని ప్రతిపాదనలు పంపింది.
గతంలో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి చేసిన విజ్ఞప్తులను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రం కోరింది. ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వాలని ప్రతిపాదించింది. కరువు, ఫ్లోరైడ్ పీడిత జిల్లాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే పథకంగా ఉందని వెల్లడించింది. కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ల ఎకనామీలో.. తెలంగాణ వన్ ట్రిలియన్ కంట్రిబ్యూట్ చేసేందుకు పని చేస్తున్నదని తెలిపింది.
మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనకు నిధుల వరద
హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్’ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నది. గోదావరి నుంచి నగరానికి 20 టీఎంసీలను హైదరాబాద్ తాగునీరు అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లు అవుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్ వంతెనల నిర్మాణంతో పాటు ఇతర పనులకు రూ.14,100 కోట్లు అవుతోంది.
వీటికి కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరింది. మెట్రో విస్తరణకు కేంద్రం సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50:50 వాటాతో మెట్రో ఫేజ్‌ను 2 చేప్టటేందుకు నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేసింది. ఫేజ్ 2లో భాగంగా నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపొలిస్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్ చెరు, ఎల్‌బీ నగర్–-హయత్ నగర్ మధ్య మొత్తం 76.4 కిలో మీటర్లు నిర్మించేందుకు రూ.24,269 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపింది.
సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిసినప్పుడు చేసిన ప్రతిపాదనలను గుర్తుచేస్తూ, ఈ బడ్జెట్‌లో హైదరాబాద్ రవాణా వ్యవస్థకు, మూసీ సుందరీకరణకు ప్రత్యేక ప్యాకేజీని ఆశిస్తున్నది.
ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ రవాణా ముఖచిత్రాన్ని మార్చబోయే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణానికి సంబంధించి భూసేకరణ వ్యయంలో కేంద్రం భారం పంచుకోవాలని రాష్ట్ర సర్కార్ కోరింది. నిర్మాణ పనులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేసింది. గతంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై చర్చించారు. ట్రిపుల్ ఆర్‌తో పాటు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు అనుసంధానంగా ఉండే రేడియల్ రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం, దక్షిణ భాగానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వడమే కాకుండా.. ఈ రోడ్లను కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని తెలిపింది.
సవతి తల్లి ప్రేమ వద్దు
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను స్వాగతిస్తూనే, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. ఏపీతో సమానంగా తెలంగాణను చూడాలని, నిధుల కేటాయింపులో వివక్ష చూపొద్దని కోరుతున్నది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి ఇస్తున్న ప్రోత్సాహకాల తరహాలోనే, అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
కృష్ణా, గోదావరి నదీ జలాల్లో వాటాల పంపిణీతో పాటు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నాబార్డ్ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించాలని లేదా గ్రాంట్ల రూపంలో సాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మాణానికి సర్వశిక్షా అభియాన్ లేదా ఇతర కేంద్ర పథకాల ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరింది.
దాదాపు రూ.24 వేల కోట్లు అవుతున్న వీటికి ప్రత్యేక రుణం తీసుకునేందుకు అనుమతించాలని ప్రతిపాదించింది. యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తలపెట్టిన స్పోర్ట్స్ వర్సిటీకి ఆర్థిక సహకారం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
