తెలంగాణలో 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. దేశంలో ఇదే రికార్డ్: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. దేశంలో ఇదే రికార్డ్: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: దేశంలోనే రికార్డ్ స్థాయిలో తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాసంగి వడ్ల కొనుగోళ్లపై మంగళవారం (జూన్ 9) సెక్రటేరియట్‎లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెంగాణలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యిందని.. యాసంగిలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొన్నామని చెప్పారు. రబీ, ఖరీఫ్ సీజన్ కలిపి 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని.. ఇన్ని టన్నుల ధాన్యం సేకరణ దేశంలోనే రికార్డ్ అని తెలిపారు. 

వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రూ.35,077 కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు. 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. రైతులకు ఇబ్బంది లేకుండా స్థానికంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ టార్గెట్ పెట్టిందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించిందని తెలిపారు.

 తెలంగాణ పొరుగు రాష్ట్రం ఏపీలో 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వరిలో 61 శాతం తెలంగాణలోనే అవుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ద్వారా మహిళా సంఘాలు, పీఏసీలను బలపరుస్తున్నామన్నారు. మహిళా సంఘాల ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయించామని.. రూ.171 కోట్లు మహిళా సంఘాలకు ఇచ్చామన్నారు. 

 పీఏసీల ద్వారా 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ధాన్యం కొనుగోలుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగులు అందుబాటులో లేవని దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రతిపక్షాలు ప్రభుత్వా్న్ని బద్నాం చేస్తున్నాయని మండిపడ్డారు.