- 10 మందిలో ఇంకా ఆరుగురిపై విచారణ పూర్తి చేయాల్సి ఉందని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను విచారించేందుకు మరో 8 వారాల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును తెలంగాణ స్పీకర్ కార్యాలయం కోరింది. గతంలో ఇచ్చిన 3 నెలల గడువు సరిపోనందున.. మరోసారి పెంచాలని కోర్టులో తాజాగా అప్లికేషన్ దాఖలు చేసింది. స్పీకర్‌కు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లు, ఇతర కార్యక్రమాల వల్ల పార్టీ ఫిరాయించినట్లు అభియోగాలు ఉన్న ఎమ్మెల్యేలను విచారించేందుకు సమయం సరిపోలేదని అందులో పేర్కొంది. మొత్తం 10 మందిలో కేవలం నలుగురు ఎమ్మెల్యేలపై దాఖలైన ఫిరాయింపుల వ్యవహారంలో విచారణ జరిపినట్లు నివేదించింది.
ఈ నలుగురిపై తీసుకున్న నిర్ణయాన్ని రిజర్వ్‌లో పెట్టినట్లు తెలిపింది. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ అధికారాలు, రోజువారి కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సుల కారణంగా మిగతా ఆరుగురిపై అందిన ఫిరాయింపుల అభియోగాలపై విచారణ చేపట్టేందుకు టైమ్ సరిపోలేదని పేర్కొంది. దీంతో మరో రెండు నెలలు సమయం ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
అయితే.. చివరగా జులై 31న ఫిరాయింపుల వ్యవహారంపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ అంశంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ గడువు అక్టోబర్ 31 (శుక్రవారం)తో ముగిసింది. కాగా, ఈ నెల 24వ తేదీనే స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. అయితే, సోమవారం ఈ పిటిషన్‌పై స్పీకర్ తరఫు అడ్వకేట్లు సీజేఐ బెంచ్ ముందు ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఫిరాయింపులపై బీఆర్ఎస్ కేవియట్..
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కార్యాలయం మరింత గడువు కోరినందున బీఆర్ఎస్ నేతలు కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. స్పీకర్ దాఖలు చేసిన అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదనలు కూడా వినాలని అభ్యర్థించారు. ఫిరాయింపులపై రెండేండ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ధర్మాసనం 3 నెలల గడువు ఇచ్చిందని, మరింత గడువు ఇవ్వొద్దని అభ్యర్థించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
