
- క్రీడా రంగానికి బడ్జెట్లో 16 రెట్లు నిధులు పెంచినం: రేవంత్‌రెడ్డి
- స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ కోర్సులు పెట్టాలి: కొణిదెల ఉపాసన
హైదరాబాద్, వెలుగు: ఖేలో ఇండియా, కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి క్రీడా పోటీలకు హైదరాబాద్‌ను వేదికగా మార్చాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తీర్మానం చేసింది. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించి, క్రీడారంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. గురువారం హైదరాబాద్‌లోని లీలా హోటల్లో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశంలో సీఎం మాట్లాడారు. ఐటీ రంగంలోలాగే క్రీడా రంగంలో కూడా తెలంగాణ ప్రఖ్యాతి పొందాలని, హైదరాబాద్ క్రీడా ప్రపంచానికి కేంద్రంగా మారాలని ఆకాంక్షించారు.
ఈ ఏడాది క్రీడా రంగానికి కేటాయించిన బడ్జెట్‌ను 16 రెట్లు పెంచినట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధిక సంఖ్యలో స్టేడియాలు, ఆధునిక పరికరాలు ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని, వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు.
క్రీడారంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమని, అందుకే బోర్డులో ప్రముఖులకు కార్పొరేట్లు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించినట్లు వివరించారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానంగా ఉపాసన కొణిదెల (హబ్ కో చైర్‌పర్సన్) మాట్లాడుతూ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ కోర్సులు ప్రారంభించాలని, క్రీడా సామగ్రిపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరారు.
దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి స్పోర్ట్స్ సామగ్రిపై పన్నుల తగ్గింపు కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీతో సహా ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు. గ్రామ, మండలం, నియోజకవర్గ స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించి, వాటి ద్వారా రాష్ట్ర స్థాయి జట్లను ఎంపిక చేస్తామన్నారు. కోచ్‌లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు.
స్కూల్ లెవెల్ ఆటలకు ప్రాధాన్యం
కపిల్ దేవ్ (మాజీ క్రికెట్ కెప్టెన్) మాట్లాడుతూ క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో పాల్గొనేలా చూడాలని సూచించారు. అభినవ్ బింద్రా (షూటర్) మాట్లాడుతూ ప్రతి స్కూల్లో ఒక పీఈటీ, పీఈడీ ఉండేలా చూడాలన్నారు. స్కూల్‌స్థాయిలో ఆటలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, ఎక్సర్సైజ్లిటరసీపై అవగాహన పెంచాలని వీతా ధాని (ధాని ఫౌండేషన్) కోరారు.
పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్ క్రీడాకారుడు) మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి దశలవారీగా క్రీడా పోటీలు నిర్వహించడం ద్వారా మెరుగైన క్రీడాకారులను ఎంపిక చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్‌రావు, రాష్ట్ర క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోని బాలదేవి తదితరులు పాల్గొన్నారు.