
రాష్ట్రంలో ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదన్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్ 3న 49 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 1766 టేబుల్స్ ఉంటాయన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గతంలో కంటే ఎక్కువగా పోలయ్యాయన్నారు. రాష్ట్రంలో లక్షా 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు. 78 నియోజకవర్గాల్లో 75 శాతం పోలింగ్ నమోదయ్యిందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 70.74 పోలింగ్ శాతం నమోదయ్యిందని చెప్పారు వికాస్ రాజ్. 2018తో పోల్చితే 3 శాతం తగ్గిందన్నారు. 2018లో 73.37 శాతం నమోదయ్యిందన్నారు. 80 ఏళ్లకి పై బడిన వారికి హోం ఫ్రం ఓట్ అవకాశం కల్పించామని.. హోం ఫ్రం ఓట్ సక్సెస్ అయ్యిందన్నారు. రాష్ట్రంలో మోడల్,ఉమెన్ స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టామన్నారు.
రాష్ట్రంలో 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని చెప్పారు వికాస్ రాజ్.. 18 ఏళ్ల వయసు వారు 3.06 శాతం ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ ఉన్నారని చెప్పారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ పెట్టామన్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర సీసీ కెమెరాలు..10 సెగ్మెంట్లకు ఒక సెక్టార్ పెట్టామన్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 46.68 శాతం పోలింగ్ నమోదయ్యిందన్నారు. 35,655 పోలింగ్ స్టేసన్లు ఏర్పాటు చేశామని చెప్పారు.