తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్..

తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్..

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సోమ‌వారం సాయంత్రం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కంటైన్‌మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. 1450 కుటుంబాలు మాత్రమే కంటైన్మెంట్ పరిధిలో ఉన్నాయని సీఎం తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్‌ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని, కరోనాతో జీవించడం నేర్చుకోవాలని అన్నారు సీఎం. బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు పోవాల‌న్నారు. ప్ర‌తీ ఒక్క‌రూ స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని అన్నారు. త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ లు ధరించాల‌ని, లేదంటే రూ.1000 జ‌రిమానా విధిస్తామ‌ని సీఎం తెలిపారు.

హైదరాబాద్‌ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని, దుకాణాలలో శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారని సీఎం పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో సెలూన్ షాపులు తెరచుకుంటాయని చెప్పారు. ఈ-కామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలు జరపుకోవచ్చన్నారు. అయితే ఫంక్షన్ హాల్స్, థియేటర్లు, మత ప్రార్థనలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. అన్ని రకాల విద్యా సంస్థలు కూడా తెర‌వ‌బ‌డ‌వని అన్నారు. రాత్రివేళల్లో కర్ఫ్యూ యథాతధంగా కొనసాగుతుందన్నారు.